తెలంగాణ

telangana

ETV Bharat / state

'కంటి వెలుగు' ఇక శాశ్వతం.. నిరంతరం నేత్ర వైద్యం అందించేలా చర్యలు - Kanti Velugu scheme in Telangana

Kanti Velugu scheme in Telangana : కంటి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కేసీఆర్‌ కంటి వెలుగు కేంద్రాలను శాశ్వత ప్రాతిపదికన నెలకొల్పాలని నిర్ణయించింది. మూడేళ్లకోసారి క్షేత్రస్థాయిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించినా.. నిరంతరం నేత్ర సమస్యలను పరిష్కరించేలా శాశ్వత కేంద్రాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Kanti Velugu scheme in Telangana
Kanti Velugu scheme in Telangana

By

Published : Nov 21, 2022, 9:29 AM IST

Kanti Velugu scheme in Telangana : రాష్ట్రంలో నిరంతరం నేత్ర వైద్యం అందించేలా ప్రభుత్వ చర్యలు చేపట్టింది. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కేసీఆర్‌ కంటి వెలుగు కేంద్రాలు ఏర్పాటు చేయాలని.. కంటి వెలుగును శాశ్వతం చేయాలని భావిస్తోంది. బోధనాసుపత్రుల్లో ఎలాగూ నేత్ర వైద్య నిపుణులు ఉంటారు కనుక.. అన్ని జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కంటి వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. వీటిలో నేత్ర వైద్యం, పరీక్షలు నిత్యం అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని ఆరోగ్య శాఖను ఆదేశించింది.

తొలి విడత అనుభవాలతో..: తొలి విడత కంటి వెలుగు కార్యక్రమం 2018 ఆగస్టు 15న ప్రారంభమై.. 2019 మార్చి 31తో ముగిసింది. 9,887 గ్రామాల్లో కొనసాగిన ఈ కార్యక్రమంలో మొత్తం కోటీ 54 లక్షల 71 వేల 769 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. దీని ద్వారా పలు అంశాలను వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. వేలాది మంది దీర్ఘకాలంగా నేత్ర సమస్యలతో బాధపడుతున్నారని.. వాటిలోనూ పలు రకాల లోపాలున్నాయని నిర్ధారించారు. వీటికి కారణాలనూ విశ్లేషించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని సుమారు 7 నుంచి 8 నెలల పాటు నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని ఇప్పటికే రుజువైంది. దీనివల్ల అప్పటికప్పుడు రోగులు లబ్ధి పొందుతున్నా.. తర్వాత కాలంలో నేత్ర వైద్య సౌకర్యాలు సమీపంలో లేకపోవడం పెద్దలోటుగా మారింది. జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో కొన్నిచోట్ల నేత్ర వైద్యులున్నా.. వారికి ప్రత్యేక కేంద్రమంటూ లేకుండా ఆయా ఆసుపత్రుల్లోనే ఒక భాగంగా కొనసాగుతున్నారు. వారు అందుబాటులో ఉన్నారనే విషయం కూడా రోగులకు తెలియడం లేదని వైద్యశాఖ గుర్తించింది. కేసీఆర్‌ కంటి వెలుగు కేంద్రాల ఏర్పాటు ద్వారా నేత్ర సమస్యలను తొలిదశలో గుర్తించడం, సత్వరమే చికిత్స అందించడం వీలవుతుందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.

పరికరాల సద్వినియోగం..: రాష్ట్రంలో రెండో విడతగా వచ్చే జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో దాదాపు కోటీ 54 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి.. దృష్టి సమస్యలను చక్కదిద్దుతారు. ఈ శిబిరాల్లో వినియోగించే పరీక్ష పరికరాలను వృథాగా ఉంచకుండా కొత్తగా నెలకొల్పే శాశ్వత కంటి వెలుగు కేంద్రాల్లో వినియోగించనున్నారు. ఈ కేంద్రాల్లో నేత్ర వైద్య నిపుణులు, ఆప్టోమెట్రిస్ట్‌లను అందుబాటులో ఉంచుతారు. ఇక్కడ దూరదృష్టి, హ్రస్వదృష్టి, శుక్లాలు, ఇన్‌ఫెక్షన్లు, ఇతర సమస్యలకు చికిత్స అందిస్తారు. ఆపరేషన్‌ అవసరమైతే సమీపంలోని పెద్దాసుపత్రికి పంపిస్తారు. ప్రతి రోగి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చుతారు.

నేత్ర సమస్యలకు సత్వర చికిత్స..: "కంటి వెలుగు రెండోవిడత ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నేత్రపరీక్షలు నిర్వహించనున్నాం. ఈ కార్యక్రమాన్ని మూణ్నాలుగేళ్లకోసారి నిర్వహించడంతో పాటు దీనికి శాశ్వత రూపం కల్పించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం. ప్రస్తుతం నేత్ర వైద్యం బోధనాసుపత్రుల నుంచి కొన్ని కింది స్థాయి ఆసుపత్రుల వరకు అందుబాటులో ఉన్నా.. లక్ష్యం నెరవేరడం లేదు. దీన్ని వ్యవస్థీకృతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. కేసీఆర్‌ కంటి వెలుగు కేంద్రాల ఏర్పాటుతో ప్రజలకు తమ సమీపంలోనే నిరంతర నేత్రవైద్యం అందుబాటులో ఉంటుంది. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వీటిని త్వరలోనే కార్యరూపంలోకి తీసుకొస్తాం." - హరీశ్‌ రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

ఇవీ చూడండి..

రెండో విడత కంటి వెలుగు.. జనవరి 18 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధం

కెమికల్​ చల్లి.. పొగ పెట్టి.. బైక్​పై మరణ శిక్ష ఖైదీలు పరార్​

ABOUT THE AUTHOR

...view details