ఆంధ్రప్రదేశ్ సభాపతి తమ్మినేని వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. న్యాయవ్యవస్థను సభాపతి అవమానపరిచారని ఆరోపించారు. ఏపీ న్యాయవ్యవస్థ, శాసనసభ పరిమితులపై చర్చకు తెలుగుదేశం సిద్ధంగా ఉందన్నారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ సభాపతి చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమన్నారు.
న్యాయవ్యవస్థను సభాపతి అవమానపరిచారు: కనకమేడల - రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ వ్యాఖ్యలు
మెజార్టీతో ఎన్నికైన ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ పరిధికి లోబడే నిర్ణయాలు తీసుకోవాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ సూచించారు. ఎంతటి గొప్ప వ్యక్తులైనా రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాల్సిందేనని గుర్తుచేశారు. ప్రతిదానికి చంద్రబాబుతో పోల్చుకుంటే.. వైకాపా అధికారంలోకి రావడం ఎందుకు అని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం అచ్చెన్నాయుడు పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కనకమేడల మండిపడ్డారు.
![న్యాయవ్యవస్థను సభాపతి అవమానపరిచారు: కనకమేడల kanakamedala-comments-on-thammineni-seetharam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7872705-404-7872705-1593759708165.jpg)
ఎన్నికైన ప్రభుత్వాలు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని తమిళనాడు మాజీ సీఎం జయలలిత కేసులో అపెక్స్ కోర్టు స్పష్టంగా చెప్పిందని కనకమేడల గుర్తుచేశారు. న్యాయస్థానాలు రాజ్యాంగ ఉల్లంఘనలను గుర్తించి.. అవసరమైన చోట వాటిని సరిచేస్తాయని తెలిపారు. ఈ స్ఫూర్తికి విరుద్ధంగా, పాలక వైకాపా నాయకులు అప్రజాస్వామిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. కోర్టులు జోక్యం చేసుకున్నప్పుడు.. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని కనకమేడల మండిపడ్డారు.
ఇదీ చదవండి:గుడ్న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కొవాక్జిన్!