రణరంగంగా కామారెడ్డి.. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లిన రైతులు Kamareddy Municipal Master Plan Issue : కామారెడ్డి కలెక్టరేట్ వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కలెక్టరేట్ వద్ద రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఆందోళనలో ఇద్దరు మహిళలు, రైతు సొమ్మసిల్లిపడిపోయారు. తోపులాటలో కానిస్టేబుల్‌కు స్వల్పగాయాలయ్యాయి. కామారెడ్డి కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు రైతుల యత్నించారు. ఈ క్రమంలో కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులు తొలగించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు.
కలెక్టరేట్ గేటుకు పోలీసులు వేసిన తాళాన్ని రైతులు తొలగించారు. గేటు దూకి కలెక్టరేట్‌లోకి కొందరు రైతులు వెళ్లారు. కామారెడ్డి కలెక్టర్ ముందు రైతులు బైఠాయించారు. రైతులతో కలిసి బైఠాయించిన ఎమ్మెల్యే రఘునందన్‌రావు ధర్నాలో పాల్గొన్నారు.
ఎక్కడైతే వ్యవసాయం నడవదో.. రాళ్లు గుట్టలు ఉంటాయో అక్కడే పరిశ్రమలు పెడతామని మీరు ప్రకటనలు చేయండి. మేం శాంతియుతంగా రైతులను ఇళ్లకు తీసుకువెళ్తాం. వ్యవసాయానికి పనికిరాని భూములనే పరిశ్రమలకు కేటాయించాలి.కేటీఆర్... ఇండస్ట్రీయల్ జోన్లను మార్చి.. రెసిడెన్షియల్‌గా మార్చి సంతకం పెట్టారు. - ఎమ్మెల్యే రఘునందన్‌రావు
అసలు ఈ మాస్టర్ ప్లాన్ గొడవ ఏంటంటే..?రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ బృహత్ ప్రణాళికను దిల్లీకి చెందిన ఓ సంస్థతో ఇటీవల తయారు చేయించారు. కామారెడ్డి పట్టణంతో పాటు విలీన గ్రామాలైన అడ్లూర్, టెకిర్యాల్ , కాల్సిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వరపల్లిని కలుపుకుని 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారు చేశారు. మొత్తం పట్టణాన్ని ఇండస్ట్రియల్, గ్రీన్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లుగా విభజించి.. ఆ వివరాలను ఈ మధ్యే ప్రకటించారు.
2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు చెప్పారు. పారిశ్రామిక జోన్ కోసం 1200 ఎకరాలతో 8.5 శాతం ప్రతిపాదించారు. ఇందులో నేషనల్ హైవే పక్కన పచ్చని పంటలు పండే.. అడ్లూర్, ఇల్సిపూర్, టెకిర్యాల్, అడ్లూర్ ఎల్లారెడ్డి రైతులకు చెందిన 900 ఎకరాల భూములను చూపారు. దీనివల్ల ఈ భూములు రెసిడెన్షియల్ కింద పనికిరావని చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఈ భూములకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. భవిష్యత్‌లో ఇళ్ల నిర్మాణం కూడా కష్టమవుతుందని భావించిన రైతులు ఆందోళనబాట పట్టారు.
కామారెడ్డి మున్సిపల్ మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాటపట్టారు. రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో బాధిత రైతులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. 8 గ్రామాల మీదుగా ప్రతిపాదించిన 100 ఫీట్ల రోడ్డు తమకొద్దంటూ ఈ సందర్భంగా రైతులు నినదించారు. గ్రీన్ జోన్, ఇండస్ట్రీయల్ జోన్ పేరుతో తరతరాలుగా సాగుచేసుకుంటున్న పచ్చని పంటపొలాల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే సహించబోమని స్పష్టం చేశారు. రైతులకు సమాచారం ఇవ్వకుండానే అధికారులు ఏకపక్షంగా భూసేకరణ అంచనాలు రూపొందించారని ఆరోపించారు. తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను కాపాడుకునేందుకు తెగించి పోరాడుతామని రైతులు స్పష్టం చేశారు. బాధిత గ్రామాల్లో ఒకటైన అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ సర్పంచ్ భర్తను కామారెడ్డి రైల్వేస్టేషన్ చౌరస్తాలో రైతులు నిలదీశారు.