Kaleshwaram Lift Irrigation Projects Update : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తీవ్రమైన సమస్యలు మూడేళ్ల క్రితమే ఎదురయ్యాయి. వాటిని పరిష్కరించి తగిన చర్యలు తీసుకోవడంలో నిరక్ష్యం జరిగినట్లు వెల్లడైంది. గేట్ల నిర్వహణలో సమస్యలు, లోపాలు, గేట్లు ఎత్తినప్పుడు నీరు కిందకు విడుదలయ్యే వేగంలో విపరీతమైన మార్పులు ఉన్నట్లు అప్పుడే గుర్తించారు.
ఈ సమస్యను అధిగమించడానికి ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబోరేటరీ లేక పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్- సీడబ్ల్యూపీఆర్ఎస్ వంటి సంస్థలతో నమూనా అధ్యయనాలు చేయించి అవసరమైన చర్యలు తీసుకోవాలని 2020 జనవరి 8న సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్, రామగుండంలోని కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు లేఖ రాశారు. అయినా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోలేదన్న విషయం సీడీవో రాసిన లేఖలను బట్టి స్పష్టమవుతోంది. మూడేళ్ల తర్వాత, సమస్య తీవ్రత పెరిగాక ఇప్పుడు సీడబ్ల్యూపీఆర్ఎస్తో అధ్యయనం చేయించడానికి లేఖ రాసినట్లు తెలిసింది.
కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాల సోదాలు
Kaleshwaram Projects Damage : గేట్ల నిర్వహణలో లోపం, బ్యారేజీ సమీపంలో గేట్ల ఎగువన ఇసుక మేట వేయడం, పర్యావసానంగా ఎక్కువ కేంద్రీకృత వేగంతో నీటి ప్రవాహం, గేట్ల నుంచి నీటి విడుదల సమయంలో ప్రవాహ వేగం నిలకడగా లేకపోవడం వల్ల రక్షణ పనులు దెబ్బతినడం తదితర అంశాలపై కాళేశ్వరం ఈఎన్సీకి రాసిన లేఖలో సీడీవో వివరంగా పేర్కొంది. ఒక గేటు వద్ద ఇసుక ఎక్కువగా మేట వేసినప్పుడు దీనినుంచి పూర్తిస్థాయిలో నీరు వెళ్లలేనప్పుడు పక్క గేట్ల నుంచి డిజైన్ చేసిన దానికంటే ఎక్కువ వేగంతో నీటి ప్రవాహం ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమస్య డిజైన్‌కు సంబంధించినది కాదని, సీడబ్ల్యూపీఆర్ వంటి సంస్థలతో అధ్యయనం చేయించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించాయి.
పరిణామాలు ప్రాజెక్టు గేట్లు ఎత్తిన తర్వాత నీరు కిందకు దూకే వేగాన్ని షూటింగ్ వెలాసిటీ అంటారు. ఒక బ్యారేజీలో ఇది సెకనుకు 4 మీటర్లు అయితే ఇంకో బ్యారేజీలో సెకనుకు 5 మీటర్లు ఉంటుంది. కానీ కాళేశ్వరం బ్యారేజీల్లో, ఈ వేగం ఒకచోట సెకనుకు 12 నుంచి 14 మీటర్లు అయితే ఇంకోచోట సెకనుకు 16 నుంచి 18 మీటర్లు ఉన్నట్లు గుర్తించారు. అంటే ఉండాల్సిన దానికంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. దీనివల్ల బ్యారేజీల దిగువన ఉన్న సిమెంటు కాంక్రీటు దిమ్మెలన్నీ చెల్లాచెదురవడం, ఇసుక కొట్టుకుపోవడం వంటి పర్యవసానాలు తీవ్రరూపం దాల్చాయి.