Akepati Amarnath Reddy Encroached Lands:ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఆయన కుటుంబీకుల పేరుతో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాలో ఉన్నట్లు రెవెన్యూశాఖ అంచనాకు వచ్చింది. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి సుమారు 200 ఎకరాలను ఆయన అధికారికంగా బదలాయించుకున్నట్లు ఆరోపణలున్నాయి. వ్యవహారం బయటకు పొక్కడంతో కొన్నింటిని ఆన్‌లైన్‌నుంచి తొలగించినట్లు సమాచారం.
Akepati Amarnath Reddy controversy : ఆకేపాటి భూదందాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రెవెన్యూ యంత్రాంగం అంతర్గతంగా విచారణ చేపట్టింది. ప్రభుత్వ భూములను ఆకేపాటికి కట్టబెట్టడంలో లోగడ ఇక్కడ పనిచేసిన అన్నమయ్య జిల్లా రాజంపేట తహసీల్దారు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది. దీనిపై విజిలెన్స్ విచారించింది. రాజంపేట మండలం మందపల్లి రెవెన్యూ గ్రామానికి చెందిన 739 సర్వేనంబరులో 4,389.27 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఇందులో కొంత ఆకేపాటి కుటుంబీకుల పేరిట డీకేటీ పట్టాలతో నమోదైందని సమాచారం.
మైనర్ల పేరిటా భూములను రికార్డుకు ఎక్కించారని సమాచారం:భూమి సబ్‌డివిజన్, స్క్రూటినీ చేయకుండా ఆన్‌లైన్‌లో చేర్చి డిజిటల్ సంతకాలతో అడంగల్, 1బి, పాసుపుస్తకాలను లోగడ పొందినట్లు గుర్తించారు. ఆకేపాటి కుటుంబ పరివారంతోపాటు బినామీ పేర్లతోనూ ఇక్కడ రెవెన్యూ రికార్డులు పొందినట్లు తేలింది. మైనర్ల పేరిటా భూములను రికార్డుకు ఎక్కించారని సమాచారం. మందపల్లి గ్రామంలో 553 సర్వేనంబరులో 1,905.60 ఎకరాలు ఉండగా.. అందులో కొంత సబ్‌డివిజన్ చేసుకుని ఆక్రమించుకున్నట్లు రెవెన్యూశాఖ గుర్తించింది.
కుటుంబసభ్యుల పేర్లు గుర్తింపు:అసైన్‌మెంటు కమిటీతో సంబంధం లేకుండా 110 ఎకరాలను వెబ్‌ల్యాండ్‌లో.. డీకేటీ పట్టాల పేరిట ఆన్‌లైన్ చేసుకున్నట్లు రెవెన్యూవారు గుర్తించారని తెలుస్తోంది. వీరిలో ఉమ్మడి కుటుంబానికి చెందిన ఆకేపాటి జ్యోతమ్మ, ఆకేపాటి సుజన, ఆకేపాటి అనసూయమ్మ, ఆకేపాటి సాయి అఖిల్‌రెడ్డి, ఆకేపాటి సాయి అనురాగ్‌రెడ్డి, ఆకేపాటి సాయి భరత్, ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి పేరిట భూములున్నాయి. ఈ జాబితాలో బినామీల పేర్లూ వెలుగుచూశాయి. వీరి పేరిట దఫాలుగా డీకేటీ పట్టాలు పొందినట్లు రెవెన్యూశాఖ గుర్తించింది.