KA Paul On TRS Rajya Sabha Candidates: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని మరోసారి రుజువైందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి రాజ్యసభకు ఎంపిక చేసిన ముగ్గురు వ్యక్తులు ఎవరని ఆయన ప్రశ్నించారు. కుంభకోణాలు, అక్రమార్కులు, భూ కబ్జాదారులకు పాల్పడిన వారిని రాజ్యసభకు పంపిస్తారా అంటూ నిలదీశారు. 1,200 మంది అమరవీరుల కుటుంబాల్లో ఒకరు కూడా అర్హులు లేరా అని ప్రశ్నించారు. ఒకరు మైనింగ్ డాన్ రవిచంద్ర, మరొకరు రూ. 500 కోట్ల స్కామ్‌లో పట్టుబడిన పార్థసారధిరెడ్డి, గచ్చిబౌలిలో భూకబ్జాలు చేసిన దామోదర్‌రావును ఎంపిక చేశారని ఆరోపించారు.
వీరికి ఏ అర్హత ఉందని రాజ్యసభకు పంపుతున్నారని కేఏ పాల్ నిలదీశారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలన సాగుతోందన్న పాల్... ఈ పాలనను అంతం చేసేందుకు చివరి వరకు పోరాటం చేస్తానన్నారు. తెరాసలో ఉన్న ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు ఏమాత్రం సిగ్గు, బుద్ధి ఉన్నా పార్టీ నుంచి బయటకు రావాలన్నారు. అక్రమాలు, అవినీతి పాలనను ప్రశ్నించేందుకు, తెలంగాణను అప్పుల నుంచి విడిపించి బంగారు తెలంగాణ చేయడమే తన లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజ్యసభకు ఎంపిక చేసిన ముగ్గురిని వెంటనే విత్ డ్రా చేయించి... అమరవీరుల కుటుంబాలకు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.