KA Paul on CM KCR: ప్రత్యేక తెలంగాణ కోసం తమ ప్రాణాలను సైతం ఆత్మార్పణ చేసిన వీరులను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ తెలంగాణ ప్రజలకే దక్కుతాయని ప్రజలను రెచ్చగొట్టి వారి ఆత్మ బలిదానాలతో వచ్చిన ప్రత్యేక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. నేడు అమరవీరుల కుటుంబాలను అన్ని రకాలుగా నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ.. పన్నెండు వందల మంది అమరవీరులను ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ పిలవకపోవడం.. ప్రజల పట్ల అతనికి ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతుందని ధ్వజమెత్తారు. కేసీఆర్తో పాటుగా కాంగ్రెస్, భాజపా చేయలేని పనిని తాను చేసి చూపిస్తానన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రాబోయే ఎన్నికల్లో 20 సీట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అమరవీరుల కుటుంబాలకు విద్య వైద్యంతో పాటుగా వసతి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రం తెరాస కేసీఆర్ కుటుంబానిది, కాంగ్రెస్ సోనియమ్మది, ఆరెస్సెస్ భాజపాది కాదన్న కేఏ పాల్.. ఈ రాష్ట్రం తెలంగాణ అమరవీరులదని ఆయన ఉద్ఘాటించారు. దళితుల, బడుగు బలహీనర్గాల, తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్న ఆయన.. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ సీఎంగా కాదు కదా.. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవరని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా చేస్తూ ఆడుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్లో జగన్, దేశంలో మోదీ సైతం అదే చేస్తున్నారని విమర్శించారు.