సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశం తర్వాత కె.కేశవరావు, నామ నాగేశ్వర్‌రావు పలు అంశాల గురించి వివరించారు. ఏడేళ్లుగా కేంద్రం తెలంగాణను పెడచెవిన పెట్టిందని కేశవరావు అన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, హామీలు నెరవేర్చడం లేదని చెప్పారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఇప్పటివరకు కృష్ణ నదీ జలాల వివాదాన్ని కేంద్రం తేల్చలేదన్నారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం ఈసారి 24 శాతానికి పెరిగిందని.. సాగు విస్తీర్ణానికి తగ్గట్టు కేంద్రం యూరియా ఇవ్వడం లేదని అన్నారు. కేంద్రం తీసుకొస్తున్న నూతన విద్యుత్ చట్టంను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. నూతన విద్యుత్ చట్టంతో కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. జాతీయ రహదారుల విస్తరణపై కేంద్రం మాట తప్పిందన్నారు.