హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10.05 గంటలకు జస్టిస్ భూయాన్‌తో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసైలు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సతీమణి సంఘమిత్ర, కుమార్తె, బంధువులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఇంకా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఎస్.నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం అనంతరం జస్టిస్ భూయాన్ తొలి రోజు మొదటి కోర్టు హాలులో కేసుల విచారణను చేపట్టారు.
అనుమానాలకు తెరదించుతూ హాజరైన సీఎం
గత కొంతకాలంగా గవర్నర్ కార్యాలయానికి, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న రాజకీయ విభేదాల నడుమ ఈ కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం తీరుపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఆమెపై మంత్రులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తారా అన్న అనుమానాలకు తెరదించుతూ ముఖ్యమంత్రి హాజరయ్యారు. 2021 అక్టోబరులో గత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం రాజ్‌భవన్‌కు ముఖ్యమంత్రి రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో నవ్వుతూ కరచాలనం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు సీఎం, గవర్నర్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లు కలిసి మాట్లాడుకున్నారు. కార్యక్రమం అనంతరం కిషన్‌రెడ్డి, గవర్నర్, సీఎంలు ఒకేచోట కూర్చుని తేనీరు సేవించారు. వేదికపై జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్నపుడు గవర్నర్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు.