రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై ఆయన చేత ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, న్యాయమూర్తులు హాజరు కానున్నారు.
జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రస్థానం
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Telangana high court cj)గా నియమితులైన జస్టిస్ సతీష్ చంద్ర(Telangana high court cj) శర్మ 1961 నవంబర్ 30న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జన్మించారు. ఆయన తండ్రి బి.ఎన్.శర్మ భోపాల్‌లోని భర్కతుల్లా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, తల్లి శాంతి శర్మ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేశారు. ప్రాథమిక విద్య జబల్పూర్లోని సెంట్రల్ స్కూల్లో పూర్తి చేశారు. 1981లో సాగర్‌లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పొందారు. మూడు సబ్జెక్టుల్లో డిస్టింక్షన్ సాధించి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పొందారు. అదే విశ్వవిద్యాలయం నుంచి 1984లో ఎల్ఎల్బీ డిగ్రీని పొందారు. అందులోనూ మూడు బంగారు పతకాలు సాధించారు.
1984 సెప్టెంబర్ 1న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1993లో అడిషినల్ సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 2004లో సీనియర్ ప్యానెల్ కౌన్సెల్‌గా పదోన్నతి పొందారు. 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. 42 ఏళ్లకే ఈ హోదా పొందిన వ్యక్తిగా గుర్తింపు దక్కించుకున్నారు. 2008 జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన పలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో అనుసంధానమై ఉన్నారు. ఎన్నో పరిశోధన పత్రాలు ప్రచురించారు. కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆగస్టు 31నుంచి ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.
సంబంధిత కథనం: