తెలంగాణ

telangana

By

Published : Dec 17, 2019, 7:57 AM IST

ETV Bharat / state

'నిరుపేదలకు వేగంగా న్యాయసేవలు అందాలి'

ప్రతి పేదవాడికీ సత్వర న్యాయసేవలు అందించాలని జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ రాష్ట్రాల న్యాయసేవా ప్రాధికార సంస్థలను ఆదేశించారు. న్యాయ సేవా సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలు, వ్యవస్థాగతంగా బలోపేతం చేయాల్సిన విషయాలపై జస్టిస్‌ ఎన్వీ రమణ దృష్టి సారించారు.

Justice NV Ramana said 'Fastest legal services for the poor'
Justice NV Ramana said 'Fastest legal services for the poor'

'నిరుపేదలకు వేగంగా న్యాయసేవలు అందాలి'

నిరుపేదలకు వేగంగా న్యాయసేవలు అందించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ రాష్ట్రాల న్యాయసేవా ప్రాధికార సంస్థలను ఆదేశించారు. త్వరితగతిన న్యాయసేవలు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఆయన రాష్ట్రాల న్యాయసేవా ప్రాధికార సంస్థల కార్యనిర్వాహక అధ్యక్షులు, కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.


దేశవ్యాప్తంగా ఉన్న న్యాయసేవా సంస్థల ప్రణాళికలు, ఆలోచనలు తెలుసుకొని వాటి అమలు కోసం అందరూ మరింత సమన్వయంతో పనిచేయడం ఎలా అన్న అంశంపై చర్చించారు. అర్హులైన పేదలకు కోర్టుల్లో న్యాయ సహాయం అందించడం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ప్యానల్‌ న్యాయవాదులకు నిర్మాణాత్మక శిక్షణ తరగతుల నిర్వహణ, జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ జారీచేసిన మార్గదర్శకాలను జిల్లాస్థాయి సంస్థలు సమర్థంగా అమలు చేయడం, వాటి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంపై జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మాట్లాడారు. అన్ని న్యాయసేవా ప్రాధికార సంస్థల కార్యాలయాలను వన్‌స్టాప్‌ సెంటర్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.

న్యాయ సహాయంపై విస్తృత ప్రచారం...

అరెస్టుకు ముందు, అరెస్టు.. రిమాండ్‌ దశల్లో అందించే సహాయం గురించి విస్తృత ప్రచారం కల్పించడంపై దృష్టిపెట్టాలని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. న్యాయ సహాయం అవసరమైన సందర్భాల్లో.. ఒక వ్యక్తిని పోలీసు స్టేషన్‌కు పిలిపించినప్పటి నుంచీ సమర్థంగా సాయం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

దిల్లీలోని నల్సా కార్యాలయం నుంచి దూరదృశ్య విధానంలో రాష్ట్రాల న్యాయసేవా ప్రాధికార సంస్థల కార్యనిర్వాహక అధ్యక్షులు, కార్యదర్శులతో సమీక్షిస్తున్న జస్టిస్ ఎన్.వి. రమణ

ప్రీ-అరెస్ట్‌, అరెస్టు, రిమాండ్‌లకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై న్యాయవాదులకు పూర్తిస్థాయి శిక్షణ ఇప్పించాలని, అప్పుడు వారు కక్షిదారుల తరఫున సమర్థంగా కోర్టుల్లో వాదనలు వినిపించగలుగుతారని అభిప్రాయపడ్డారు. అప్పీళ్లు దాఖలు చేయాలనుకున్న ఖైదీల్లో ఎవరు న్యాయం సహాయం కోసం ఎదురుచూస్తున్నదీ గుర్తించి వారితరఫున సకాలంలో అప్పీళ్లు దాఖలు చేసేలా చూడాలని నిర్దేశించారు. అలాగే అండర్‌ ట్రయల్స్‌లో బెయిల్‌ దరఖాస్తుల దాఖలు కోసం ఎదురుచూస్తున్న వారిని గుర్తించి వెంటనే తగినసాయం అందించాలన్నారు.

న్యాయవాదులకు శిక్షణ...

న్యాయవాదులకు తగిన శిక్షణ ఇచ్చి జైళ్లలోని న్యాయసేవా కేంద్రాలను క్రియాశీలం చేయాలని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. అప్పీళ్లు దాఖలు చేయలేని స్థితిలో ఉన్న ఖైదీలు, జైలుశిక్షకు మించి కారాగారంలో మగ్గుతున్న నేరస్థులను గుర్తించేందుకు విస్తృతంగా ప్రయత్నించాలని చెప్పారు. ఉచిత న్యాయసేవ, సలహా అందుకోవడానికి ఖైదీలందరికీ హక్కుందన్న విషయం గురించి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

అప్పీళ్లు దాఖలు చేయడానికి ప్రైవేటు న్యాయవాదులను పెట్టుకోలేని స్థితిలో ఉన్న ఖైదీలకు వేగంగా చేయూత అందించాలని సూచించారు. ఖైదీల తరఫున దాఖలు చేసిన అప్పీళ్లు పైకోర్టుల్లో ఏ స్థాయిలో ఉన్నదీ ఎప్పటికప్పుడు వారికి సమాచారం అందించాలని నిర్దేశించారు.

ప్రస్తుతం ఉత్తర్‌ ప్రదేశ్‌, దిల్లీల్లో నిర్వహిస్తున్న న్యాయసేవా అవగాహన ప్రచారాన్ని అన్ని రాష్ట్రాలకూ విస్తరింపజేయాలని నిర్ణయించారు. 2020లో ఫిబ్రవరి, ఏప్రిల్‌, జులై, సెప్టెంబరు, డిసెంబరు నెలల్లో రెండో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌లు నిర్వహించాలని తీర్మానించారు. అందులో ప్రధానంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను గుర్తించి పరిష్కరించాలని, అందుకోసం తగిన సంఖ్యలో లోక్‌ అదాలత్‌ బెంచ్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

ఇదీ చూడండి: త్వరలో లోకాయుక్త, మానవ హక్కుల సంఘాల ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details