Justice Chandru on CM KCR: న్యాయవ్యవస్థ అందరి విషయంలో సమానంగా వ్యవహరించాలని జస్టిస్ చంద్రు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో 'విధ్వంసం అవుతున్న ప్రజాస్వామ్య పునాదులు-పరిరక్షణ మార్గాలు' అనే అంశంపై సదస్సు జరిగింది. ఇందులో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేకంగా మాట్లాడితే కేసీఆర్, జయలలిత లాంటి వారు ఎన్నో రోజులు అధికారంలో ఉండరని జస్టిస్ చంద్రు అన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి తీరు విస్మయానికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. సమ్మె ఎన్నిరోజులు చేస్తారో చూస్తా అంటూ బెదిరించారని ప్రస్తావించారు. యూనియన్లతో మాట్లాడను అంటూ ప్రకటించారని.. యూనియన్లతో కాకుండా ఉద్యోగులతో మాత్రమే మాట్లాడతా అనడం ఏంటని జస్టిస్ చంద్రూ ప్రశ్నించారు.
Justice Chandru on CM KCR:దేశంలో కార్మిక సంఘాలు ఉన్నాయని.. ఇక మీద కూడా ఉంటాయని.. సమస్యలపై కచ్చితంగా యూనియన్లతోనే మాట్లాడాలని ఆయన అన్నారు. ప్రజల హక్కులకు వ్యతిరేకంగా వెళ్తే ఎన్నో రోజులు కేసీఆర్ అధికారంలో ఉండలేరన్నారు. జై భీమ్ సినిమా తనకు ఒక కొత్త గుర్తింపు తీసుకొచ్చిందని జస్టిస్ చంద్రు వెల్లడించారు. ఆ సినిమా తర్వాత తనకు దేశవ్యాప్తంగా ఎన్నో ఆహ్వానాలు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. నిజాయితీగా నిలబడితే ఏ కేసు అయినా గెలవచ్చన్నారు. అందుకు ఇటీవల జరిగిన దిల్లీ రైతు ఉద్యమం నిదర్శనమన్నారు. జై భీమ్ సినిమాలో చూపించినట్టే ఆ కేసులో ఏ చదువు లేని గిరిజనులు నిలబడ్డారని.. అది ఒక చారిత్రాత్మక విజయమని ఆయన అన్నారు.