ముద్ర కో-ఆపరేటివ్ సొసైటీ బాధితులకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు న్యాయం చేయాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ కోరారు. రైతులకు సాయం చేస్తామని.. గ్రామీణ నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని.. కో-ఆపరేటివ్ పద్ధతిలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామని.. వ్యవసాయ ఉత్పత్తులను కొంటామంటూ..ఓ సొసైటీని ఏర్పాటుచేసి ప్రజలను మోసం చేశారని జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు. కేంద్రం, ఆర్బీఐతో సంబంధాలున్నాయని.. తమ సొసైటీకి త్వరలో గుర్తింపు వస్తుందని చెప్పారన్నారు. డిపాజిట్ చేస్తే ఉద్యోగాలొస్తాయంటూ పలువురి వద్ద రెండు నుంచి రెండన్నర లక్షల రూపాయలు వసూలుచేశారని పేర్కొన్నారు. రెండు సంవత్సరాల వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చెప్పి.. 2015లో డిపాజిట్ చేసిన వారికి ఇంతవరకు నగదు చెల్లించలేదని.. జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు.
డబ్బులు వసూలుచేసి తిరిగివ్వకపోగా.. సర్టిఫికెట్లు వారి దగ్గరే పెట్టుకొని నిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి వేల సంఖ్యలో బాధితులున్నారని.. నిందితుల ఆస్తులు జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.