Ponguleti Meet with Bhatti : ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భట్టి విక్రమార్కను కలిశారు. హైదరాబాద్‌లోని నివాసంలో భట్టితో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక అనంతరం తొలిసారి సీఎల్పీ నేతతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించామని.. పార్టీని అధికారంలోకి తేవడమే తమ ముందున్న లక్ష్యమని భట్టి విక్రమార్క తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ లక్ష్యాలు, ఆకాంక్షలు నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమన్న ఆయన.. బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో కలిపి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తామని పునరుద్ఘాటించారు.
ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ తీరు.. కేసీఆర్ పట్ల నేను కొట్టినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చెయ్యి అన్నట్లుగా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడు రెండే వర్గాలని.. ఒకటి ప్రభుత్వ అనుకూల వర్గం, మరోటి వ్యతిరేక వర్గమని తెలిపారు. ప్రజలు ఈసారి కేసీఆర్‌ను ఇంటికి పంపాలని బలంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై స్పందించిన ఆయన.. ఆ వ్యవహారమంతా పార్టీలోని సీనియర్ నేతలు చూసుకుంటారని, తనకు తెలియదని చెప్పారు.
నెలాఖరు నుంచి కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ నేతల వలసలు..: భవిష్యత్తులో రాష్ట్రంలో రెండు పార్టీలు మాత్రమే మిగులుతాయని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. బీఆర్‌ఎస్ నేతలు పీసీసీ, ఏఐసీసీ నేతలతో టచ్‌లో ఉన్నారని.. నెలాఖరు నుంచి కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ నేతల వలసలు ఉంటాయని స్పష్టం చేశారు.
Jupalli Krishna Rao Met Bhatti Vikramarka : కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక.. రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జూపల్లి కాంగ్రెస్‌లో చేరుతున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. జూపల్లి నేడు భట్టి విక్రమార్కును ఆయన నివాసంలో కలిశారు. కొల్లాపూర్‌లో జరగబోయే బహిరంగ సభకు రావాలని భట్టిని ఆహ్వానించారు.