స్టైఫండ్ పెంపు, కొవిడ్ ప్రోత్సాహకాలు వెంటనే అమలు చేయడం సహా... ఇతర డిమాండ్లు పరిష్కరించాలంటూ బుధవారం నుంచి చేస్తున్న సమ్మెను జూనియర్ డాక్టర్లు (JUDAS) విరమించారు. నిన్న సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లు.... హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు, వరంగల్ ఎంజీఎం, నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి సహా అన్ని జిల్లాల్లోని వైద్యాలయాల్లో.. ఆందోళనకు దిగారు. వెంటనే స్టైఫండ్ పెంచాలని, కొవిడ్ ప్రోత్సాహకాలు అమలుచేయాలని నినాదాలు చేశారు. ఈ సమ్మెపై నిన్ననే అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR).. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆందోళన మంచిది కాదని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే విధుల్లో చేరాలని తెలిపారు.
JUDA's: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు - తెలంగాణ తాజా వార్తలు
19:16 May 27
JUDA's: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు సహా ఇతర డిమాండ్లలో న్యాయపరమైనవన్నీ... వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ మేరకు సీఎంతో సమీక్ష ముగిసిన వెంటనే.. గత రాత్రే వైద్యారోగ్యశాఖ, వైద్య విద్యాశాఖ డైరెక్టర్లు శ్రీనివాసరావు, రమేశ్‌రెడ్డి.. విద్యార్థి వైద్యులతో చర్చలు జరిపారు. కొవిడ్‌తో మృతిచెందిన... వైద్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 50 లక్షల పరిహారానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిహారం చెల్లించే అంశం, నిమ్స్‌లో వైద్యసిబ్బందికి పడకల సౌకర్యం, కొవిడ్ వైద్య సిబ్బందికి..... 10 శాతం ప్రోత్సాహకంపై స్పష్టమైన హామీ లభించనందున ఆందోళన కొనసాగిస్తామని.... గతరాత్రి చర్చల తర్వాత జూనియర్ డాక్టర్లు ప్రకటించారు.
ఈ పరిణామాల మధ్య గురువారం ఉదయం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి SAM రిజ్వీ.... జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో డిమాండ్లలో కొన్నింటిపై సానుకూలంగా స్పందించారని తెలిపిన జూనియర్ డాక్టర్లు అంగీకరించిన డిమాండ్లపై జీవో జారీ చేయాలని వైద్యారోగ్యశాఖ కార్యదర్శిని కోరినట్లు తెలిపారు. పరిహారం విషయంలో సాంకేతిక ఇబ్బందులున్నాయని చెప్పినట్టు తెలిపిన వారు ఉత్తర్వుల జారీకి రెండు రోజుల సమయం పడుతుందని చెప్పినట్లు వెల్లడించారు.
అన్ని అంశాలపై సాయంత్రం సమావేశమై చర్చించిన జూనియర్ డాక్టర్లు (JUDAS) ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతానికి డిమాండ్లు నెరవేరనప్పటికీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి వచ్చిన సానుకూల స్పందనను దృష్టిలో పెట్టుకుని ఆందోళన విరమించాలనే నిర్ణయానికి వచ్చినట్టు..... వారు తెలిపారు. తక్షణం అత్యవసర సేవలకు హాజరవుతామని... రేపటి నుంచి యథావిధిగా అన్ని విధులు నిర్వహిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టంచేశారు.
ఇదీ చూడండి:police treatment: వింటారా..? ఐసోలేషన్‌లో ఉంటారా..?