ప్రభుత్వాస్పత్రులు పూర్తిగా కరోనా సేవల్లో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా గాంధీ ఆస్పత్రి... 3నెలలుగా పూర్తిగా కొవిడ్ చికిత్సకే అంకితమైంది. గాంధీలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లలో 200 మందికిపైగా పీజీ చివరి సంవత్సరం చదువుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 1,500 వరకు వైద్య విద్యార్థులు... ఈనెల 20 నుంచి జరగనున్న పీజీ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 500 మంది వరకు వైద్య విద్యార్థులు.. ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం... కొంత కాలంగా కొవిడ్ సేవలకే తాము పరిమితమైన నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో రాయలేం!
ఇటీవలి కాలంలో వైద్య విద్యార్థుల్లోనూ... పలువురికి కరోనా సోకిందని... ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు రాయలేమని తమకు సహాయం చేయాలని కోరుతున్నారు. 3నెలలుగా రోజుకి దాదాపు 12 గంటలపాటు వైద్య సేవల్లో కొనసాగటం వల్ల చదువుకునేందుకు సమయం లేదన్నది వైద్య విద్యార్థుల వాదన. ఉస్మానియాకు చెందిన ఓ వైద్య విద్యార్థి... పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ గవర్నర్‌కి లేఖ రాశారు. తనకు కొవిడ్ సోకి గాంధీలోనే చికిత్స పొందుతున్నానని.. ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జ్ కానున్నట్టు పేర్కొన్నారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 14 రోజుల పాటు... హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ కారణంగా తాను 20నుంచి ప్రారంభంకానున్న పరీక్షల్లో మొదటి, రెండు రాయలేకపోతానని ఆవేదన చెందారు.