రెవెన్యూ శాఖ ప్రక్షాళనపై దృష్టిసారించిన సర్కార్ మరిన్ని సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. వీఆర్వో వ్యవస్థ రద్దు చేసిన తరుణంలో ప్రత్యామ్నాయ విధానాన్ని నెలకొల్పేందుకు ఆ శాఖ కసరత్తు చేస్తోంది. గ్రామస్థాయిలో కొత్తగా జూనియర్ అసిస్టెంట్లను నియమించాలని భావిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న జోనల్ పోస్టుల సర్దుబాటు ప్రక్రియ పూర్తికాగానే రెవెన్యూశా ఖకు కొత్తరక్తం ఎక్కించే ప్రక్రియ ప్రారంభం కానుంది. గతేడాది వీఆర్వో వ్యవస్థను తొలగించడంతో 5,485 మందికి ఇతర విధులు అప్పగిస్తున్నారు. వీరిలో కొంతమందినైనా మాతృశాఖలోనే సర్దుబాటు చేయాలని రెవెన్యూ సంఘం ప్రభుత్వాన్ని కోరుతూ వస్తోంది. ఈ క్రమంలో 85 శాతం మందిని ఇతర శాఖలకు మళ్లించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.
మారిన పరిస్థితుల్లో..
మారిన రెవెన్యూ శాఖ పనితీరుతో తహసీల్దార్లు సంయుక్త సబ్ రిజిస్ట్రార్ల హోదాలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అపరిష్కృత సమస్యలు, ప్రభుత్వ భూముల విషయంలో తప్ప దస్త్రాలను తిరగేసే అవసరం లేదు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ధ్రువీకరణ పత్రాల జారీ, ప్రభుత్వ పథకాల సమాచారం, కలెక్టర్ల నుంచి వచ్చే ప్రొటోకాల్ విధులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో విధుల వంటి బాధ్యతలు తహసీల్దారు కార్యాలయానివే. గతంలో వీఆర్వోలు ఈ విధులను నిర్వహించేవారు. వారికి బదులుగా ప్రతి మండలానికి పది మందికి తగ్గకుండా జూనియర్ అసిస్టెంట్లను నియమించాలనే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. ఇలా 1800 మందిని తీసుకోవాలని ప్రస్తుతం భావిస్తున్నా, అవసరాలను బట్టి అయిదు వేలకు పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. జూనియర్ అసిస్టెంట్ల ప్రతిపాదన ఉన్నా, అవసరమైతే జూనియర్ ఆర్ఐల స్థాయిలో ఎంపిక చేయాలనే ఆలోచన ఉంది.