పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కోసం దినపత్రిక కంటే కాస్త పెద్ద పరిమాణంలో ఉన్న బ్యాలెట్ పత్రాన్ని ఉపయోగించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. రెండు నియోజకవర్గాల్లోనూ... అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీలో ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్న హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ నియోజకవర్గానికి 54.5 సెంటీమీటర్ల వెడల్పు, 60.4 సెంటీమీటర్ల పొడవు ఉన్న బ్యాలెట్ పత్రాన్ని ఉపయోగించనున్నారు.
ఈసీ అనుమతి...
71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న నల్గొండ- వరంగల్- ఖమ్మం నియోజకవర్గం కోసం 43.5 సెంటీమీటర్ల వెడల్పు, 60.4 సెంటీమీటర్ల పొడవు ఉన్న బ్యాలెట్ పత్రాన్ని ఉపయోగిస్తారు. ఈ మేరకు రెండు పరిమాణాలతో బ్యాలెట్ పత్రాలకు ఈసీ అనుమతిచ్చింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ముద్రణాలయంలో బ్యాలెట్ పత్రాలను ముద్రించనున్నారు.
బ్యాలెట్ పత్రంలో ఒక్కో అభ్యర్థికి సంబంధించి నాలుగు కాలమ్స్ ఉంటాయి. క్రమసంఖ్య, పేరు-పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థి, ఫొటోతో పాటు ఓటర్లు ప్రాధాన్యక్రమంలో ఓటు వేసేందుకు వీలుగా మరో కాలమ్ ఉంటుంది. బ్యాలెట్ పత్రాల పరిమాణం భారీగా పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా జంబో బ్యాలెట్ బాక్సులకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది.