తెలంగాణ

telangana

ETV Bharat / state

కొడాలి నాని పిటిషన్​పై తీర్పు రేపటికి వాయిదా

ఏపీ మంత్రి కొడాలి నాని పిటిషన్‍పై హైకోర్టులో విచారణ జరిగింది. మంత్రి వ్యాఖ్యల వీడియో పరిశీలన, తీర్పును ఉన్నత న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

minister kodali nani, nimmagadda ramesh kumar
మంత్రి కొడాలి నాని, నిమ్మగడ్డ రమేశ్​ కుమార్​

By

Published : Feb 17, 2021, 7:49 PM IST

ఆంధ్రప్రదేశ్​ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పిటిషన్​పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఎస్​ఈసీపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వీడియో పరిశీలన, తీర్పును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో న్యాయస్థానం ముందు ఇప్పటికే ఇరువర్గాలు తమ వాదనలు వినిపించాయి. ఎన్నికల కోడ్ అమల్లో లేనప్పుడు ఎంత తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఎస్ఈసీ స్పందించలేదని.. ఎన్నికల సమయంలో రాజ్యాంగ సంస్థపై దూషణలతో దాడి చేస్తున్నారని... ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కుమార్ ఆక్షేపించారు. మంత్రి నాని వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన తరఫు న్యాయవాది ఆరోపించారు. వీడియోలపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు సీనియర్ న్యాయవాది రఘురాంను అమికస్ క్యూరీగా కోర్టు నియమించింది. వీడియోలో మాట్లాడిన అంశాలను పరిశీలించాక తీర్పును రేపటికి వాయిదా వేసింది.

అసలేం జరిగింది..?

మంత్రి కొడాలి నాని ఇటీవల విలేకర్ల సమావేశంలో ఎస్‌ఈసీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా, ఎన్నికల సంఘం ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని, దానిపై వివరణ ఇవ్వాలని రమేశ్‌కుమార్..‌ ఆయనకు షోకాజ్‌ నోటీసిచ్చారు.

మంత్రి తన న్యాయవాది చిరంజీవి ద్వారా ఎస్‌ఈసీకి బదులిచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాల విషయంలో ప్రతిపక్ష పార్టీ అరాచకాల్ని బయటపెట్టే క్రమంలో మీడియా సమావేశం నిర్వహించానని నాని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థల పట్ల తనకు గౌరవం ఉందని, ప్రత్యేకించి ఎన్నికల కమిషన్‌ను గౌరవిస్తానని, షోకాజ్‌ నోటీసు ఉపసంహరించుకోవాలని మంత్రి కోరారు.

ఎస్​ఈసీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మంత్రి కొడాలి సమాధానంపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంతృప్తి చెందలేదు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ, విజయవాడ సీపీలను ఆదేశించారు. మీడియాతో పాటు సభల్లో మాట్లాడవద్దని ఆంక్షలు విధించారు. రాష్ట్రంలో ఈ నెల 21న పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్‌ ముగిసే వరకు మీడియాతో మాట్లాడవద్దని ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆదేశించారు.

ఎస్​ఈసీ నిర్ణయంపై కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్‌ఈసీని మంత్రి ఏమీ అనలేదని.... కొడాలి వ్యాఖ్యలు ఇతరుల వాటితో పోల్చలేమని ఎస్‌ఈసీ న్యాయవాది వాదించారు. వీడియో పరిశీలిస్తే విషయం తెలుస్తుందని సూచించారు. కొడాలి వీడియో ఫుటేజ్‌ను ఫైల్ చేసారా అని రిజిస్ట్రీని హైకోర్టు ప్రశ్నించింది. లేదని రిజిస్ట్రీ సిబ్బంది బదులిచ్చింది. వీడియో ఫుటేజ్ ఇస్తామని... పరిశీలించాలని కోర్టును ఎస్ఈసీ కోరింది.

విలేకర్ల సమావేశంలో మంత్రి నాని వ్యాఖ్యలివీ..

''చంద్రబాబు మానసిక పరిస్థితి బాగాలేదు. ఆయనకు, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కు పరీక్ష చేయించి, ఎర్రగడ్డ ఆసుపత్రిలో తగిన వైద్యం అందించాలి. తర్వాత విడతల్లో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో జగన్‌ ప్రభంజనాన్ని, వైకాపా గెలుపును చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్‌ వీళ్లంతా కట్టగట్టుకుని అడ్డం నిలబడినా ఆపలేరు. జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోతారు. రేషన్‌ బియ్యాన్ని కార్డుదారులకు డోర్ ‌డెలివరీ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి, పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు సీట్లు పెరుగుతాయని భయంతో తెదేపా ఫిర్యాదు చేస్తే రమేశ్‌కుమార్‌ ఆపేశారు.''’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

ఎస్‌ఈసీపై చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంపై విలేకర్లు ప్రస్తావించగా... మంత్రి స్పందిస్తూ.. ''వీళ్లంతా డ్రామా ఆర్టిస్టులు. నిమ్మగడ్డ రమేశ్‌, చంద్రబాబు వేర్వేరని రాష్ట్రంలో ఎవరూ అనుకోవట్లేదు. ఈయన చెప్పింది ఆయన చేస్తారు.. ఆయన చేసేటప్పుడు ఈయనను సంప్రదిస్తారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఆగిపోవడం, పంచాయతీ ఎన్నికలు ముందుకు రావడం, వాటిని ఇన్ని విడతలుగా పెట్టడం ఇవన్నీ హైదరాబాద్‌లోని హోటల్‌లో సమావేశాలు పెట్టుకుని ఎలా చేశారో చూశాం కదా. మేం ఒక్కటై జగన్‌ను ఇబ్బంది పెడుతున్నామని ప్రజలు భావించి ఇలా తీర్పునిస్తున్నారేమో అనుకుని వెంటనే స్టాండ్‌ మార్చేసి కేంద్రానికి ఎస్‌ఈసీపైన చంద్రబాబు లేఖలు రాస్తారు. ప్రెస్‌మీట్లు పెట్టి నిమ్మగడ్డను దూషిస్తాను అంటారు. 'నాకు అడ్వాంటేజ్‌ అవుతుంది నువ్వు తిట్టుకో' అని ఈయన చెబుతారు. మీ డ్రామాలన్నీ కట్టిపెట్టండి. లోకేశ్‌ను చిత్తూరు జిల్లాలో సర్పంచిగా పోటీ చేయమనండి.. అతణ్ని ఓడించలేకపోతే రాష్ట్రాన్ని వదిలిపోతా'' అని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండీ... సీఎం​ జన్మదిన వేడుకల్లో హరీశ్​ బ్యాటింగ్​.. ఎమ్మెల్యే బౌలింగ్​

ABOUT THE AUTHOR

...view details