తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ సినిమాలు చూసి.. అందరం అనుకునే రేప్​ చేశాం' - jubilee hills rape case latest updates

jubilee hills rape case: జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో మరింత కీలక సమాచారం సేకరించారు పోలీసులు. మైనర్లను కస్టడీలో తీసుకున్న పోలీసులు పీఎస్​లో విచారణ చేపట్టారు. ఈ విచారణలో మైనర్లు విస్తుగొలిపే విషయాలను వెల్లడించారు. ఇంతకీ నిందితులు పోలీసులతో ఏం చెప్పారంటే..!

jubilee hills rape case
jubilee hills rape case

By

Published : Jun 14, 2022, 7:12 AM IST

Updated : Jun 14, 2022, 2:02 PM IST

jubilee hills rape case: జూబ్లీహిల్స్‌ బాలిక అత్యాచారం కేసులో రోజుకో విస్తుపోయే వాస్తవం వెలుగులోకి వస్తోంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిందితులు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. అమాయకంగా ఉన్న బాలికను ఏమార్చినట్లు పోలీసులకు మైనర్లు చెప్పినట్లు విశ్వసనీయగా తెలిసింది. మైనర్‌ నిందితుల కస్టడీ సైతం నేటితో ముగుస్తుండటంతో మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

‘‘పరీక్షలు పూర్తైనప్పటి నుంచి ఖాళీగా ఉన్నాం దాదాపు ప్రతిరోజూ పబ్బుల్లో కలుసుకుంటున్నాం.. పార్టీల్లో పాల్గొంటున్నాం... ఆ రోజు అమ్నీషియా పబ్‌కు వెళ్లాం.. బాధిత బాలిక, మరోబాలికను పరిచయం చేసుకొని నాలుగైదు సార్లు కలుసుకున్నాక డేటింగ్‌కు వెళ్దామంటూ చెప్పాలనుకున్నాం... బాధితురాలు మాతో నవ్వుతూ మాట్లాడటం.. మేం ఆమెను పరిచయం చేసుకున్నప్పుడు అమాయకంగా కనిపించడంతో ఎలాగైనా సరే బాలికలిద్దరీని బయటకు తీసుకెళ్లి ఏదైనా చేద్దామనుకున్నాం... అందుకే వారి ప్రతిస్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు అసభ్యంగా ప్రవర్తించాం...వారు బయటకు రావడంతో మేమూ వచ్చేశాం... బాధితురాలిని నమ్మించాం. అత్యాచారం చేయాలనుకున్నాం. అందరం అనుకొని చేసేశాం.. ఆంగ్ల సినిమాలు... వెబ్‌సిరీస్‌లో సంఘటనలు మాకు ప్రేరణ..’’ ఇవన్నీ చెప్పింది ఎవరో కాదు... జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులు... పోలీస్‌ అధికారులతో ఈ విషయాలు చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది.


జూబ్లీహిల్స్‌ బాలిక అత్యాచార ఘటనకు సంబంధించి మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించేందుకు పోలీసులు న్యాయస్థానం ఆదేశంతో మైనర్‌ బాలురను కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా వారిని ప్రశ్నిస్తుండగా ఒకరు నోరు విప్పడం లేదని, మరో ఇద్దరు పోలీసులకు వివరాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. మైనర్లైనందున తమకు పబ్బుల్లో ప్రవేశం ఉండబోదని, అందుకే మేజర్లైన మా స్నేహితులు పార్టీలు ఏర్పాటు చేస్తే పాల్గొని బిల్లు తామే చెల్లిస్తామంటూ చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. విచారణలో వీరు వెల్లడిస్తున్న వివరాల ఆధారంగా పోలీసులు సాక్ష్యాధారాలు సేకరిస్తున్నట్టు సమాచారం. పోలీస్‌ కస్టడీ ముగియడంతో సాదుద్దీన్‌ను కోర్టులో హాజరుపరిచిన అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.


సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో నలుగురు హైదరాబాద్‌లో వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటున్నారు. మిగిలిన ఒక్కరు సంగారెడ్డి జిల్లాకు చెందిన మైనర్‌. ఆ బాలుడికి జూబ్లీహిల్స్‌లో ఉంటున్న ఒక మైనర్‌కు బంధుత్వం ఉండగా సాదుద్దీన్‌తో పాటు మరో మైనర్‌ పుప్పాలగూడలో నివసిస్తున్నారు. సాదుద్దీన్‌ మినహా మిగిలిన మైనర్లంతా హైదరాబాద్‌ శివారులోని ఓ కార్పొరేట్‌ కళాశాల, అంతర్జాతీయ విద్యాసంస్థలో ఇంటర్మీడియేట్‌ చదువుతున్నారు. పబ్బులు, పార్టీలకు వారంతా కలిసి వెళ్లేందుకు అందరికీ తెలిసిన స్నేహితుడున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. అతడే వ్యవసాయ క్షేత్రాలు, రిసార్టులు, పబ్బుల్లో పార్టీలు ఏర్పాటు చేసి మైనర్లను ఆహ్వానిస్తున్నాడని గుర్తించారు. పార్టీల్లో వీరంతా సిగరెట్లు తీసుకుంటున్నారని మద్యం తాగుతున్నారా? లేదా? అన్న అంశం ఇంకా నిర్ధరణ కాలేదని తెలుస్తోంది. పోలీసులు అందుకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరిస్తున్నారని తెలిసింది.

'ఆ సినిమాలు చూసి.. అందరం అనుకునే రేప్​ చేశాం'
నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు సామూహిక అత్యాచారం కేసులో వేగంగా సాక్ష్యాధారాలు సేకరించి అభియోగపత్రాలు సమర్పించేందుకు సమాంతరంగా పనులు చేసుకుంటున్నారు. పోక్సో చట్టంప్రకారం ప్రతి కేసులో 60రోజుల్లో అభియోగ పత్రాలు సమర్పించాలన్న నిబంధనలుండడంతో పోలీస్‌ ఉన్నతాధికారులు ఛార్జిషీట్‌లో పొందుపరచాల్సినఅంశాలపై దృష్టిసారించారు కోర్టు ఆదేశాలతో ముగ్గురు మైనర్లకు ఐదు రోజులు, మరో ఇద్దరు మైనర్లకు నాలుగు రోజులపాటు ఇచ్చిన కస్టడీ సైతం నేటితో ముగియనుంది. విచారించేప్పుడు మైనర్లను ఎవరూ ఫోటోలు తీయకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. నిందితులను సైదాబాద్‌లోని జువైనల్‌ హోం నుంచి జూబ్లీహిల్స్‌ పోలీసు ఠాణాకు టోపీలు, ముసుగులు వేసి తీసుకొచ్చారు.

ఐదోరోజు పోలీస్ కస్టడీ: జూబ్లీహిల్స్‌ బాలిక అత్యాచారం కేసులో మైనర్లను ఐదోరోజు కస్టడీలోకి తీసుకున్నారు. జువైనల్ హోంలో ఉన్న ఐదుగురు మైనర్లను జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించారు. ఐదుగురు మైనర్లను చివరి రోజు ప్రశ్నిస్తున్నారు. నేటితో ముగ్గురు మైనర్ల పోలీస్ కస్టడీ ముగియనుంది. ముగ్గురిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట పోలీసులు హాజరుపరచి జువైనల్ హోంకు తరలించనున్నారు. బాలికపై అత్యాచారానికి సంబంధించి పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

Last Updated : Jun 14, 2022, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details