JP Nadda Meets BJP State in Charges : హైదరాబాద్‌లోని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దక్షిణాది రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల అధ్యక్షులు,పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్లు,సహాయ ఇన్ఛార్జ్లతో సమావేశం జరిగింది. సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేత బీఎల్ సంతోశ్లు సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రాల వారీగా సమీక్షించిన నేతలు.. దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు, పార్టీని బలోపేతం చేయడం, విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
BJP Focus On Telangana Assembly Elections 2023 : ప్రధానంగా బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో కీలకమైన బూత్ కమిటీల ఏర్పాటుపై చర్చించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో విజయవంతమవుతున్న పార్టీ వ్యూహాలు దక్షిణాది రాష్ట్రాల్లో ఎందుకు ఆశించిన ఫలితాలివ్వడంలేదనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో అధికారంలో ఉన్నా ఓటమి పాలుకావడం.. ఇతర దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతోందని జాతీయ నాయకత్వం తెలిపింది. దీనిని ఎదుర్కోవడానికి అవసరమైన అంశాలను సిద్ధం చేయాలని పార్టీ అధ్యక్షులకు జాతీయ నాయకత్వం సూచించింది.
BJP High Command Focus On South States :జాతీయస్థాయి నుంచి చేపట్టే కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో కొన్ని రాష్ట్రాలు ముందుండగా.. మరికొన్ని ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదని జాతీయ నేతలు తెలిపారు. ప్రతి కార్యక్రమం నిర్దేశించిన మేరకు జరగాలని ఇందుకు రాష్ట్ర ఇన్ఛార్జ్లు పూర్తి బాధ్యత వహించాలన్నారు. తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీకి సానుకూలత పెరుగుతుందని గుర్తించాలన్నారు. తొమ్మిదేళ్లలో అభివృద్ధి, ప్రతి రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలు, అమలైన ప్రాజెక్టులు, వ్యయం చేసిన నిధుల వంటి అంశాలను ప్రజలకు వివరించడం కీలకమని తెలిపారు.