JP Nadda Telangana Tour on Sunday : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. కానీ పార్టీలోని అంతర్గత కలహాలు.. భారతీయ జనతా పార్టీని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి కాషాయ గూటికి చేరినవారికి సముచిత స్థానం కల్పించడంలేదన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. దీనిపై హైకమాండ్ దృష్టి సారించింది. ఓ వైపు రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను చక్కదిద్దుతూనే.. మరోవైపు అసంతృప్త నేతలతో చర్చలు జరుపుతోంది.
ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడుజేపీ నడ్డా ఆదివారం రోజున తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న నడ్డా.. సంపర్క్ సే సంవర్ధన్లో భాగంగా ఇద్దరు ప్రముఖులను వారి నివాసాలకు వెళ్లి కలవనున్నారు. ఈ క్రమంలోనే మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా సాయంత్రం 5 గంటలకు నాగర్కర్నూల్లో నిర్వహించే సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.
BJP focus on Telangana Assembly Elections 2023 : నరేంద్ర మోదీ తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధి, సాహసోపేతమైన నిర్ణయాలు.. తెలంగాణకు ఇచ్చిన నిధులను వివరిస్తూనే.. కేసీఆర్ సర్కారు వైఫల్యాలను జేపీ నడ్డా ఎండగట్టనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. సభ అనంతరం హెలికాప్టర్లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి 6:45 గంటలకు దిల్లీకి తిరుగు పయనం కానున్నారని చెప్పాయ. ఇప్పటికే ఆయన సభకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర నాయకత్వం పూర్తి చేసింది. నడ్డా పర్యటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం వస్తోందని తెలంగాణ బీజేపీ భావిస్తోంది.