ED and IT Raids: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదాయపన్ను (ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని పంజాగుట్టలోని పీఎస్‌ఆర్ గ్రానైట్స్, హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్లలో తనిఖీలు నిర్వహించారు. సోమాజీగూడలో గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ నివాసంలోనూ సోదాలు జరిగాయి.
కరీంనగర్‌లో గంగుల కమలాకర్ ఇంటితో పాటు మంకమ్మతోటలో ఆయనకు చెందిన శ్వేత గ్రానైట్, కమాన్ ప్రాంతంలోని మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్‌లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ వ్యాపారి అరవింద్‌వ్యాస్‌తో పాటు మరికొంతమంది ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. గతంలోనే 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు సుమారు 20 మంది అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. గ్రానైట్ పరిశ్రమలకు చెందిన పత్రాలను పరిశీలిస్తున్నారు.