నిరుద్యోగ యువత ఎన్నాళ్లు గానో ఎదురు చూస్తున్న ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా కీలక ప్రకటన చేశారు. 80,039 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రకటనతో తదుపరి ప్రక్రియ ప్రారంభం కానుంది. శాఖలు, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారీగా కూడా పోస్టుల సంఖ్యను ప్రకటించారు. దీంతో ఉద్యోగాల భర్తీ కోసం ముందస్తు కసరత్తు పూర్తయింది. మరోమారు సంబంధిత శాఖలను సంప్రదించి, జిల్లాల వారీగా వివరాలను కచ్చితంగా నిర్ధారించుకొని ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతిస్తుంది. ఖాళీలకు అనుగుణంగా నియామకాలు చేపట్టాల్సిందిగా నియామక సంస్థలకు అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. దాంతో తదుపరి ప్రక్రియను ఆయా నియామక సంస్థలు కొనసాగిస్తాయి.
రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా..
ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించాక నియామక సంస్థలు ఖాళీలు ఉన్న శాఖల అధిపతులను సంప్రదిస్తాయి. స్థానికత ఆధారంగా ఖాళీల వివరాలతో పాటు రోస్టర్ పాయింట్ తదితర సమాచారాన్ని తీసుకుంటాయి. ఈ ప్రక్రియ ముగిశాక ఖాళీలకు అనుగుణంగా నియామక సంస్థలు ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేస్తాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా విభజించారు. దీంతో రాష్ట్రంలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్ నియామకాలకు సంబంధించి కొత్త రోస్టర్ అమలు కానుంది. అన్ని రకాల రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకొని కొత్త రోస్టర్ ప్రకారం నియామకాలు చేపడతారు. రాష్ట్ర స్థాయి పోస్టులకు సంబంధించి మాత్రం పాత రోస్టర్ కొనసాగనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మొదటి సారి గ్రూప్ వన నోటిఫికేషన్ రానుంది.