తెలంగాణ

telangana

ETV Bharat / state

'జాబ్‌ కనెక్ట్‌'.. ఉపాధి కల్పనకు మంచి మార్గం - నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు

కష్టపడి డిగ్రీ పూర్తి చేసినా.. ఉద్యోగం దొరకదు. ప్రైవేటు కొలువులు ఎక్కడున్నాయో.. ఎవరు తీసుకుంటారో తెలియదు. ఇలా నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్న ఉద్యోగార్థులకు హైదరాబాద్‌ పోలీసు విభాగం, టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఇంటర్నేషనల్‌(టీఎంఐ) సంస్థలు అండగా నిలుస్తున్నాయి. వేర్వేరు కంపెనీల్లో ఉపాధి చూపిస్తున్నాయి. 'జాబ్‌ కనెక్ట్‌' పేరిట.. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో వాహనం తిప్పుతూ ఉద్యోగార్థులకు సూక్ష్మ, చిన్నతరహా సంస్థల్లో ఉపాధి అవకాశాలను చేరువ చేస్తున్నాయి.

job connect programme in hyderabad employment to the unemployees
'జాబ్‌ కనెక్ట్‌'.. ఉపాధి కల్పనకు మంచి మార్గం

By

Published : Mar 18, 2021, 7:46 AM IST

హైదరాబాద్‌ పోలీసు విభాగం, టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఇంటర్నేషనల్‌(టీఎంఐ) సంస్థలు నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నాయి. వేర్వేరు కంపెనీల్లో ఉపాధి చూపిస్తూ వారి భవిష్యత్​కు బాటలు వేస్తున్నాయి. ‘జాబ్‌ కనెక్ట్‌, ఉద్యోగ రథం’ పేర్లతో సంచార వాహనాలను.. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో తిప్పుతూ అర్హులకు ఉపాధి అవకాశాలు చేరువ చేస్తున్నాయి. ఇంటర్మీడియట్‌, డిగ్రీ, వృత్తివిద్య కోర్సులు పూర్తిచేసినవారు.. సంచార వాహనంలో పేర్లు నమోదు చేసుకుంటే చాలు.. ప్రైవేటు సంస్థల నుంచి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల పరిధిలోని సూక్ష్మ, చిన్నతరహా కంపెనీలు, సంస్థలతో టీఎంఐ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. మూడేళ్ల వ్యవధిలో 10,564 మందికి ఇలా ఉద్యోగాలు దక్కటం గమనార్హం.
నిరుద్యోగితపై సర్వే..
కొవిడ్‌ ప్రభావంతో వేల ఉద్యోగాలు పోయాయి. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలయ్యాక టీఎంఐ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించినా..అలా వెళ్లినవారి స్థానాల్లో కొత్త నియామకాలకు ప్రకటనలు ఇస్తున్నట్లు గుర్తించింది. ఉద్యోగార్థుల్లో 90 శాతం మంది జీతం తక్కువైనా సరే.. ప్రత్యేకించి మెట్రో నగరాల్లో ఇంటికి సమీపంలో కొలువు కోరుకుంటున్నారని టీఎంఐ సంస్థ ప్రతినిధులు తెలుసుకున్నారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల యజమానులు ఉద్యోగ ప్రకటనలు ఇస్తే.. పదో తరగతి నుంచి డిగ్రీ చదివినవారి వరకు వందలాదిగా దరఖాస్తు చేస్తున్నారని, విద్యాధికులను తీసుకుంటే మెరుగైన మరో అవకాశం రాగానే ఉద్యోగం వదిలేసి వెళ్తున్నారని గ్రహించారు. వీటన్నింటికీ పరిష్కారంగా జాబ్‌ కనెక్ట్‌ వాహనాన్ని ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముఖ్య ప్రాంతాలకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.
వాహనంలో ఏముంటుంది?
జాబ్‌ కనెక్ట్‌ వాహనంలో టీఎంఐతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు, బహుళజాతి కంపెనీలు, షాపింగ్‌మాల్స్‌ సహా చిన్న తరహా కంపెనీలు, రెస్టారెంట్లు తదితరాల సమాచారం అందుబాటులో ఉంటుంది. ‘జాబ్‌ కనెక్ట్‌’ వాహనం ఉద్యోగార్థుల వద్దకు వచ్చినప్పుడు వారి వివరాలు నమోదు చేసుకుంటే చాలు..విద్యార్హతలు, నైపుణ్యాల ఆధారంగా సంబంధిత సంస్థలు, కంపెనీల నుంచి ముఖాముఖికి రావాలని సంక్షిప్త సందేశాలొస్తాయి. ఉద్యోగ సమాచారాన్ని మొబైల్‌ యాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యం వాహనం వద్దే ఉంటుంది. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులకు సైతం సంబంధిత సమాచారం జాబ్‌ కనెక్ట్‌ వాహనంలో లభిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details