బీటెక్ చివరి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు ఆలస్యమైతే పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని భావిస్తున్న జేఎన్‌టీయూహెచ్ వాటిని సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. పరీక్షల నిర్వహణను జూన్ రెండో వారంలోనే ప్రారంభించాలని ఇటీవల కాలపట్టికను ఖరారు చేశారు. ఫలితాలను జులై 15 నాటికి వెల్లడించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంజినీరింగ్ పట్టా ఇచ్చి పంపాలని భావిస్తున్నారు.
రెండు నెలలు ముందుగానే...
బీటెక్ చివరి ఏడాది రెండో సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు నెలాఖరులో ప్రారంభించి సెప్టెంబరులో పూర్తి చేయాలని కొద్ది నెలల క్రితం ప్రాథమిక కాలపట్టికను ఖరారు చేశారు. గతనెల 26వ తేదీ నుంచి చివరి సెమిస్టర్ ఆన్‌లైన్ పాఠాలను ప్రారంభించారు. ముందుగా రోజుకు 3 గంటలు పాటు బోధించాలన్నది ప్రణాళిక. వైరస్ తీవ్రత తగ్గే వరకు పరీక్షలు జరపకుండా ఆగడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని, ఆగస్టు/సెప్టెంబరులో వైరస్ తీవ్రత తగ్గకుండా ఉంటే ఎంటెక్/ఎంఫార్మసీలో ప్రవేశాలతోపాటు విదేశీ చదువుకు వెళ్లేందుకు ఇబ్బంది అవుతుంది.
అమెరికాలో మంచి వర్సిటీల్లో సీట్లు ఖరారైన పలువురు విద్యార్థులు పరీక్షలు ఆలస్యం చేస్తే తమకు జరిగే నష్టంపై ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఎగ్జామ్ ఫ్రం హోం(ఇంటి నుంచి పరీక్షలు)కు శ్రీకారం చుట్టాలని వర్సిటీ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రోజుకు 3 గంటల ఆన్‌లైన్ పాఠాలను ఆరు గంటలపాటు బోధించేందుకు కళాశాలలకు అనుమతి ఇచ్చారు. ఫలితంగా జూన్ 14 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ముందస్తు పరీక్షల వల్ల సప్లిమెంటరీ విద్యార్థులతో కలిపి దాదాపు 45 వేల నుంచి 50 వేల మంది విద్యార్థులకు ఇబ్బంది తప్పుతుంది.
ఇదీ చదవండి: అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు