JNTU Hyderabad Latest News :ఇంటర్మీడియెట్‌లో 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థుల్లో కొందరు ఇంజినీరింగ్‌లో చేరాక మొదటి సంవత్సరంలోనే ఫెయిలవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన జేఎన్‌టీయూ(Jawaharlal Nehru Technological University) హైదరాబాద్ అలాంటి విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోషన్ ఇచ్చేందుకు వీలుగా తొలి ఏడాది అకడమిక్ క్రెడిట్స్‌ను 75 శాతానికి తగ్గించింది.
మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయం(Osmania University)అధికారులు అయితే ఈ విద్యా సంవత్సరానికి ఏకంగా క్రెడిట్స్ వ్యవస్థనే తొలగించారు. క్రెడిట్స్‌ను తగ్గించి విద్యార్థులకు ప్రమోషన్ ఇస్తున్నా, వారికి మిగిలిన సెమిస్టర్లలో ఒత్తిడి పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. వర్సిటీ అధికారులు మాత్రం, విభిన్న నేపథ్యాల నుంచి వస్తున్న విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటున్నారు.
ఓయూలో విద్యార్థుల ధర్నా- వీసీ రవీందర్ రాజీనామాకు డిమాండ్
బోధనా ప్రమాణాలు లేకేనా?:ఇంజినీరింగ్ తొలి ఏడాదిలోనే వందల మంది ఉత్తీర్ణులు కాకపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇంటర్మీడియెట్‌లో తెలుగు మీడియం(Intermediate Telugu Medium) చదివిన వారిలో చాలామందికి ఒకేసారి ఆంగ్లంలో చదవాలంటే ఇబ్బంది కావడం, అలాగే అప్పటి వరకు గ్రామాల్లో చదువుకున్న వారు నగరాల పరిస్థితులకు అలవాటు పడలేకపోతున్నారు. ఇకపోతే ఉస్మానియా, జేఎన్‌టీయూలలో సరైన సంఖ్యలో ప్రొఫెసర్లు లేకపోవడం, కొత్తగా వచ్చిన సైబర్ భద్రత, డేటాసైన్స్, కృత్రిమమేధ వంటి కోర్సులపై కొందరు ఆచార్యులకు పూర్తిస్థాయిలో అవగాహన కొరవడటంతో కళాశాలల్లో బోధనా ప్రమాణాలు తగ్గిపోయి ఫెయిలవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని అంటున్నారు.