తెలంగాణ

telangana

ETV Bharat / state

New courses in JNTU: ఉద్యోగావకాశాలు మెరుగుపరిచేందుకు కొత్త కోర్సులను తెచ్చిన జేఎన్‌టీయూ - hyderabad district news

ఇంజినీరింగ్‌లో భాగంగా సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ వంటి బ్రాంచీలలో చేరిన విద్యార్థి దానికే పరిమితమైతే ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగావకాశాలు లభించడం కష్టమే. అదే విద్యార్థి అదనపు నైపుణ్యాలు సాధిస్తే! ఉద్యోగావకాశాలూ అదేస్థాయిలో మెరుగుపడుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా ఉద్భవిస్తున్న (ఎమర్జింగ్‌) రంగాలకు సంబంధించిన కొత్త కోర్సులను జేఎన్‌టీయూ అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఆ కొత్త కోర్సులేంటో తెలుసుకుందామా...?

New courses in JNTU
New courses in JNTU

By

Published : Oct 9, 2021, 8:27 AM IST

విద్యార్థులకు అదనపు నైపుణ్యాలు నేర్పిస్తూ ఉద్యోగావకాశాలను మెరుగుపరుచే లక్ష్యంతో... కొత్తగా ఉద్భవిస్తున్న (ఎమర్జింగ్‌) రంగాలకు సంబంధించిన కొత్త కోర్సులను జేఎన్‌టీయూ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఆయా కోర్సుల్లో చేరేందుకు అనుమతించి..వాటిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బీటెక్‌ ఆనర్స్‌, మైనర్‌ డిగ్రీలు అందించనుంది. దీనివల్ల విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో అధిక ప్రాధాన్యం దక్కుతుందని జేఎన్‌టీయూ వర్గాలు తెలిపాయి. ‘‘ఇప్పటికే మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌ వంటి బ్రాంచీలకు ఆదరణ తగ్గింది. ఆయా బ్రాంచీలకు చెందిన విద్యార్థులు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఐవోటీ వంటి కోర్సుల్లో చేరొచ్చు.

ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక విద్యార్థులకు ఇచ్చే పట్టాల్లో ప్రత్యేకంగా ఆనర్స్‌, మైనర్‌ డిగ్రీల ప్రస్తావన ఉంటుంది. ఉదాహరణకు కంప్యూటర్‌ సైన్స్‌ చదివే విద్యార్థి రోబోటిక్స్‌ను ఎంచుకుంటే బీటెక్‌ సీఎస్‌ఈతో కలిపి రోబోటిక్స్‌లో మైనర్‌ డిగ్రీ పేరిట పట్టా లభిస్తుంది. కంప్యూటర్‌ సైన్స్‌ చదివే విద్యార్థి ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌లో స్పెషలైజేషన్‌ చేస్తే బీటెక్‌ ఆనర్స్‌ డిగ్రీ లభిస్తుంది’ అని జేఎన్‌టీయూ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి ‘ఈనాడు’కు వివరించారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు సాధారణంగా 160 క్రెడిట్లు ఉంటాయని, హానర్స్‌ కోర్సులు చేస్తే 20, మైనర్‌ డిగ్రీ కోర్సులు చేస్తే 18 క్రెడిట్లు అదనంగా లభిస్తాయని వెల్లడించారు.

ఏయే కోర్సులంటే..

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, డాటా సైన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, రోబోటిక్స్‌, ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌, కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ.

ఎవరు అర్హులు..?

బీటెక్‌ మూడో ఏడాది నుంచి ఆనర్స్‌, మైనర్‌ కోర్సులు చేసేందుకు వీలుంటుంది. వీటిని ఎంచుకునే విద్యార్థులకు మొదటి రెండేళ్లలో ఒక్క బ్యాక్‌లాగ్‌ కూడా ఉండకూడదు. హానర్స్‌ కోర్సులకు సీజీపీఏ 8 అవసరం.

ఎన్‌బీఏ గుర్తింపు ఉండే కళాశాలలకే....

ఆయా కోర్సులు అందించాలనుకునే కళాశాలలకు నిర్దిష్టమైన విధి విధానాలను జేఎన్‌టీయూ రూపొందించింది. కోర్సులు అందించే విభాగాలకు జాతీయ అక్రిడిటేషన్‌ మండలి(ఎన్‌బీఏ) గుర్తింపు ఉండాలి. ఆయా సబ్జెక్టులలో ఎంటెక్‌ కోర్సులకు అనుమతి ఉండాలి. రెండో ఏడాదిలోనే ఆనర్స్‌, మైనర్‌ డిగ్రీ కోర్సులు చేసేందుకు విద్యార్థులు నమోదు చేసుకోవాలి.

ఇదీ చదవండి:Hyderabad Rains: భాగ్యనగరంలో భారీ వర్షం.. చెరువుల్లా మారిన రహదారులు

ABOUT THE AUTHOR

...view details