తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటినుంచి చివరి సెమిస్టర్‌ పరీక్షలు.. 4 వారాల పాటు కొనసాగింపు - జేఎన్​టీయూలో ఆఖరు సెమిస్టర్​ పరీక్షలు వార్తలు

ఆరు నెలల తర్వాత కళాశాలల్లో సందడి నెలకొననుంది. కరోనా కారణంగా మార్చిలో విద్యాసంస్థలు మూతపడగా తాజాగా పరీక్షలు రాసేందుకు విద్యార్థులు కాలేజీ గడప తొక్కనున్నారు. నేటినుంచి చివరి ఏడాది విద్యార్థులకు రెండో సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం నుంచి జేఎన్​టీయూలో, బుధవారం నుంచి ఉస్మానియాలో 4 వారాలపాటు వరుస పరీక్షలతో విద్యార్థులు బిజీ కానున్నారు.

university final semester exams to start from september 16
నేటినుంచి చివరి సెమిస్టర్‌ పరీక్షలు.. 4 వారాల పాటు కొనసాగింపు

By

Published : Sep 16, 2020, 7:54 AM IST

నేటినుంచి చివరి ఏడాది విద్యార్థులకు రెండో సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు హైదరాబాద్​లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 4 వారాలపాటు వరుస పరీక్షలతో విద్యార్థులు బిజీ కానున్నారు. జేఎన్‌టీయూ పరిధిలోని బీటెక్‌, బీఫార్మసీ, ఎంబీఏ కోర్సుల్లోని చివరి ఏడాది విద్యార్థులకు రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉస్మానియా పరిధిలో ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి పరీక్షల్లో భారీ మార్పులు తీసుకు రావడంతో త్వరగా పరీక్ష రాసేందుకు వీలుంటుంది. కంప్యూటర్‌ సైన్స్‌ వంటి పరీక్షలు కేవలం 3 రోజుల్లోనే ముగించనున్నారు. పలు సెట్‌ల కారణంగా పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు చేశారు.

45 రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు

ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులున్నా, కొవిడ్‌ లక్షణాలున్నా పరీక్షకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. అలాంటి వారికి 45 రోజుల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని జేఎన్‌టీయూ అధికారులు చెప్పారు. ఈమేరకు హైకోర్టుకు మంగళవారం ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులనూ రెగ్యులర్‌గానే పరిగణిస్తారు. ఉస్మానియాలోనూ 2 నెలల్లో మరోసారి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

రవాణాకు ఇబ్బందులు

ప్రస్తుతం విద్యార్థులు సొంతూళ్లలోనే ఉన్నారు. దీంతో పరీక్ష కేంద్రాలను వారు చదువుకున్న కళాశాలలోనే కేటాయించినా ప్రజా రవాణా లేక విద్యార్థులు ఇబ్బందులు పడనున్నారు. సొంత వాహనాలు లేదా ప్రైవేటు వాహనాలపైనే వెళ్లాలి. ముఖ్యంగా ఇంజినీరింగ్‌, ఫార్మసీ, డిగ్రీ కళాశాలలు శివారుల్లోని మారుమూల ప్రాంతాల్లోనే ఉన్నాయి. వెళ్లి రావాలంటే రవాణా సదుపాయం లేదు.

ఈసారి మార్పులు ఇలా..

  • విద్యార్థులు చదివే కళాశాలలోనే పరీక్ష రాయవచ్చు.
  • గదికి 10-15 మందే కూర్చుంటారు.
  • పరీక్షల సమయం 2 గంటలే.
  • ఛాయిస్‌ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ.
  • కోర్సుల వారీగా 2 షిఫ్టుల్లో పరీక్షలుంటాయి.
  • హాజరును ఆన్‌లైన్‌లో తీసుకుంటారు.
  • జేఎన్‌టీయూలో డిజిటల్‌ ఎవాల్యుయేషన్‌.

ఉస్మానియా విశ్వవిద్యాలయం

  • పరీక్ష కేంద్రాలు - 300
  • మొత్తం విద్యార్థుల సంఖ్య - 1.10 లక్షలు
  • డిగ్రీ విద్యార్థులు - 65 వేల మంది
  • సాంకేతిక, వృత్తి విద్యా విద్యార్థులు - 20 వేల మంది
  • పీజీ విద్యార్థులు - 25 వేల మంది
  • ఇంజినీరింగ్‌ పరీక్ష కేంద్రాలు - 125
  • ఫార్మసీ కేంద్రాలు - 73, ఎంబీఏ కేంద్రాలు - 91
  • మొత్తం విద్యార్థుల సంఖ్య - 55 వేలు.
  • ఇంజినీరింగ్‌ విద్యార్థులు - 45 వేల మంది
  • ఫార్మసీ విద్యార్థులు - 5 వేల మంది
  • ఎంబీఏ విద్యార్థులు - 5 వేల మంది

హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షలపై రగడ

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షల తేదీలు మార్చాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈనెల 24-26 మధ్య పరీక్షలు నిర్వహించాలని వర్సిటీ నిర్ణయించింది. అన్ని యూనివర్సిటీలు చివరి సెమిస్టర్‌ పరీక్షల నేపథ్యంలో వాటితోపాటు హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షలూ రాయాలంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విద్యార్థులంటున్నారు. ఈసారి హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షకు 62,853 దరఖాస్తులు అందాయి. ఇందులో 46 శాతం దరఖాస్తులు తెలంగాణ నుంచే ఉన్నాయి. తాజాగా తెలంగాణ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ సైతం హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని వీసీకి లేఖ రాసినట్లు చెప్పారు. అయితే వాయిదాపై ఇప్పటివరకు ఎలాంటి ఆలోచన లేదని వీసీ ప్రొ.పొదిలె అప్పారావు స్పష్టం చేశారు. అక్టోబరు ద్వితీయార్థంలో ప్రవేశ పరీక్షలు పెట్టాలని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ప్రతిపాదించగా వర్సిటీ అధికారులు అంగీకరించలేదు.

ఇదీ చదవండిఃయూజీసీ నెట్​ పరీక్ష ఈ నెల 24కు వాయిదా

ABOUT THE AUTHOR

...view details