Hemant Soren meeting with KCR: ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో ఈ సాయంత్రం ఆయన భేటీ కానున్నారు. జాతీయ రాజకీయాలు, కేంద్రం విధానాలు, ఇతర అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి. కాగా దేశంలో సమూల మార్పు కోసం ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా ఉండాలంటూ.. బుధవారం జరిగి తెరాస ప్లీనరీలో కేసీఆర్ పేర్కొనడం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితిలాగే.. భారత రాష్ట్ర సమితి రావాలనే ప్రతిపాదనలు వస్తున్నాయని కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాట.. ఆయన పక్కాగా జాతీయ పార్టీ పెట్టే యోచనలో ఉన్నారనే మాటకు బలాన్నిస్తోంది.
జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన కేసీఆర్.. గత నెల 4 న ఝార్ఖండ్ రాజధాని రాంచీలో పర్యటించారు. దేశ రాజకీయాలు, భాజపాకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసే అంశాలపై కేసీఆర్.. హేమంత్ సొరేన్తో చర్చించారు. రాంచీలో కేసీఆర్కు ఆ రాష్ట్ర ప్రజలు ఘన స్వాగతం పలికారు. బంగారు తెలంగాణ నిర్మాత, జాతీయ ఫెడరల్ నేత అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నేడు వీరిద్దరి మధ్య సమావేశం ఆసక్తికరంగా మారింది.