JC Prabhakar Reddy: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని పెన్నా నదిలో ఇసుక అక్రమాలను నిరూపిస్తానని.. అలా నిరూపించలేకపోతే ఊరు నుంచి బహిష్కరించండి అంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. పెద్దపప్పూరులో ఇసుక అక్రమాలను చూసేందుకు వెళ్తే నాపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. అసలు అక్కడ ఏం జరుగుతోందో.. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. పెద్దపప్పూరు వద్ద పెన్నా నదిలో జరుగుతున్న ఇసుక అక్రమాలను ఆయన వివరించారు.
ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇసుకను మనుషులతోనే రోజుకు 20 మంది చొప్పున తవ్వాలని.. 300 రోజులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే లోడింగ్ చేయాలన్నారు. ఒకరోజుకు 75 ట్రాక్టర్లు లేదా 15 టిప్పర్లు మాత్రమే తోలుకోవాలన్నారు. కానీ అక్కడ మాత్రం 200 హెచ్‌పీ సామర్ధ్యం గల ఐదు మిషన్లతో రాత్రింబవళ్లు పని చేస్తున్నారని.. 200 టిప్పర్లు, 80 ట్రాక్టర్లలో లోడింగ్ చేస్తున్నారన్నారు. పెన్నానదిలో లోడింగ్‌కి 23 టన్నుల ఇసుకకు 8550 రూపాయలు వసూలు చేస్తున్నారు.. కానీ మార్కెట్ డిమాండ్‌ని బట్టి రూ.16వేలు నుంచి రూ. 40వేల వరకు దండుకుంటున్నారని అన్నారు.
ఇప్పటికే ఈ ప్రాంతంలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడి చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ రైతులు ఈ పరిస్థితి చూసి ఆత్మహత్య చేసుకుంటామని అంటున్నారని.. నేను కూడా వారితో కలిసి వెళ్లి నీటిలో దూకుతానంటూ జేసి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ కోసం అధికారులు బాధ్యత వహించాలని.. వారు దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రెండు రోజుల్లో సమాధానం చెప్పకపోతే తానే స్వయంగా ప్రజలకు ఇసుక అక్రమాల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానన్నారు.