Sowing seeds with Drone in Farming : వరి విత్తనాలు విత్తేందుకు డ్రోన్‌ను ఉపయోగించడం ద్వారా సాగు వ్యయం తగ్గించవచ్చని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గుర్తించింది. కూలీల అవసరం లేకుండా, నేరుగా డ్రోన్‌తో విత్తనాలు విత్తే విధానంపై పరిశోధనల్లో సత్ఫలితాలు సాధించింది. హైదరాబాద్‌కు చెందిన ఒక అంకుర సంస్థ చేసిన ప్రయత్నం నచ్చడంతో వర్సిటీకి చెందిన పరిశోధన కేంద్రాల్లో వరి సాగుపై కొత్త ప్రయోగాలు చేస్తోంది. నారు పెంచి, నాట్లు వేయడానికి ఎకరాకు రూ.ఆరేడు వేల వరకు ఖర్చవుతున్నట్లు వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. డ్రోన్‌ను ఉపయోగిస్తే ఈ వ్యయాన్ని తగ్గించవచ్చని.. తద్వారా రైతులకు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. ఈ దిశగా ప్రత్యేక పరిశోధన ప్రాజెక్టు చేపట్టారు.
నేరుగా చల్లడం కన్నా మెరుగు
ప్రస్తుతం కొన్ని ప్రాంతాల రైతులు వరి సాగులో నేరుగా విత్తనాలను వెదజల్లే పద్ధతిని అనుసరిస్తున్నారు. మరికొందరు ‘డ్రమ్‌సీడర్’ యంత్రంతో విత్తనాలు విత్తే పద్ధతి చేపడుతున్నారు. నారు పెంచి నాట్లు వేసేవారూ ఉన్నారు. ఈ పద్ధతుల్లో ఎక్కువ ఖర్చు అవుతోంది. వీటిని తగ్గించడానికి డ్రోన్‌కు అడుగు భాగంలో గొట్టాలను ఏర్పాటుచేసి నేరుగా పొలంలో వరి విత్తనాలు చల్లితే వరసల ప్రకారం మొలకలు వస్తాయని హైదరాబాద్‌కు చెందిన మారుతీ డ్రోన్ల తయారీ అంకుర సంస్థ తన ప్రయోగంతో నిరూపించింది. ఐఐటీలో ఇంజినీరింగ్ చదివిన ప్రేమ్ అనే యువ ఇంజినీరుకు వచ్చిన ఈ ఆలోచన జయశంకర్ వర్సిటీ ముందు పెట్టడంతో మరిన్ని పరిశోధనలు చేసింది. డ్రోన్‌తో వరి విత్తనాలు విత్తే పరిజ్ఞానంపై జయశంకర్ వర్సిటీ, డ్రోన్ సంస్థ కలసి ‘మేధోపరమైన (పేటెంట్) హక్కు’ కోసం దరఖాస్తు చేశాయి. అనంతరం రైతులకు దీన్ని చేర్చాలని వర్సిటీ నిర్ణయించింది.