వచ్చేనెల నుంచి ప్రారంభం కానున్న వానాకాలం (ఖరీఫ్) సీజన్‌లో వరి, మొక్కజొన్న, పసుపు పంటలు సాగు చేస్తే మంచి ధరలు లభించవని, లాభాలు వచ్చే అవకాశాలు లేవని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ అధ్యయనంలో తేలింది. రైతులు ఏది సాగుచేస్తే ఎంత ధర వస్తుందనే అంశంపై వర్సిటీ ‘మార్కెట్ ఇంటెలిజెన్స్ సెంటర్’ (ఎంఐసీ) జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర మార్కెట్ల సరళి, ప్రజల అవసరాలు, డిమాండుపై పరిశోధన చేసింది.
జూన్- సెప్టెంబరు మధ్య వానాకాలం పంటలను రైతులు సాగు చేసి సెప్టెంబరు- ఏప్రిల్ మధ్య మార్కెట్లలో విక్రయిస్తారు. అప్పుడు వ్యాపారులు క్వింటాకు ఎంత ధరను చెల్లించవచ్చనే అంచనాలను ఎంఐసీ తయారుచేసింది. ఇప్పటికే రాష్ట్రంలో, దేశంలో ఉన్న వివిధ పంటల నిల్వలు, వాటి ధరలెలా ఉన్నాయి. వానాకాలంలో వివిధ రాష్ట్రాల్లో ఏ పంట ఎంత సాగుకావచ్చు. వాటి ఎగుమతులు, ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల అంచనాలను తయారుచేసి మార్కెట్ ధర ఏ స్థాయిలో ఉంటుందనేది విశ్లేషించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ ధరల అంచనాలను రైతులకు ముందుగానే వివరించి పంటల సాగుపై వారికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల వ్యవసాయాధికారులకు, ప్రాంతీయ పరిశోధనాకేంద్రాల శాస్త్రవేత్తలకు సూచించింది.
వరి ధాన్యం దిగుబడులతో...
గత రెండేళ్లుగా దేశవ్యాప్తంగా వరిధాన్యం దిగుబడులు పుష్కలంగా రావడంతో కేంద్రం కూడా ఈ యాసంగిలో బియ్యం కొనుగోలును తగ్గించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా కొంటోంది. ఈ నేపథ్యంలో వానాకాలంలో వరి సాగుచేస్తే ధాన్యానికి మద్దతు ధరకు మించి రాకపోవచ్చని, లాభాలుండవని అంచనా. ఉదాహరణకు వరిధాన్యం సాధారణ రకానికి వచ్చే గతేడాది(2021) అక్టోబరు నుంచి వచ్చే 2022 సెప్టెంబరు వరకూ క్వింటాకు రూ.1940 చొప్పున మద్దతు ధర ఇవ్వాలని కేంద్రం గతంలో ప్రకటించింది.