ఆత్మవిశ్వాసం, ఆశావాద దృక్పథంతో ముందుకెళ్తేనే గ్రామీణాభివృద్ధి దిశగా నిర్దేశిత లక్ష్యాలను సాధించగలుగుతామని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. దేశంలోని కొన్ని రంగాలు ఉత్పత్తి లక్ష్యాలను సాధించినప్పటికీ, చాలా రంగాలు వెనకబడే ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన ‘అన్నదాత’ వ్యవసాయ మాసపత్రిక పూర్వ సంపాదకులు, డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం జయప్రకాశ్ నారాయణ మాట్లాడారు. దేశాభివృద్ధికి కీలకమైన వ్యవసాయం, పశుపోషణ, గ్రామీణాభివృద్ధి కోసం నారాయణరావు పడిన తపన, చేసిన కృషి ఎంతో ఉందన్నారు. రైతు పక్షపాతం అందరి మనసులో ఉందని, ఆ మనసును మేధస్సుతో సంధానించకపోతే వారి ఆదాయాలు పెరగవని . జయప్రకాశ్ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ‘వ్యవసాయ రుషి వాసిరెడ్డి నారాయణ రావు’ పేరిట ప్రచురించిన స్మృతి సంచికను జయప్రకాశ్ నారాయణ, ‘ఈనాడు’ సంపాదకులు ఎం.నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు.
‘‘అత్యున్నత స్థానంలో ఉండి సాధారణ జీవితం గడిపిన వ్యక్తి పదుగురిలో ఒకనిగా సంతోషంగా జీవిస్తాడు. ఉన్నతంగా ఆలోచించే వ్యక్తి నిస్వార్థంగా జీవనం సాగిస్తాడు. ఈ రెండు లక్షణాల కలబోతగా మూర్తీభవించిన అరుదైన వ్యక్తి ‘మరపురాని మనీషి వాసిరెడ్డి గారు’ అంటూ రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఆ స్మృతి సంచికలో ప్రస్తావించి కొనియాడారు.
పాడి పరిశ్రమ అభివృద్ధి వెనక ‘అన్నదాత’ పత్రిక కృషి:తెలుగు రాష్ట్రాల్లో పాడి పరిశ్రమ ఈ స్థాయిలో అభివృద్ధి చెందడం వెనుక అన్నదాత పత్రిక, దాని పూర్వ సంపాదకులు డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు కృషి ఎంతో ఉందని ఎం.నాగేశ్వరరావు అన్నారు. 30 ఏళ్ల క్రితం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాల కొరత తీవ్రంగా ఉండేదని, అదనంగా పాలు కావాలంటే సిఫారసు లేఖలు కావాల్సి వచ్చేవని గుర్తుచేశారు.