ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆస్తులను దోచుకోకుండా అడ్డుకోవడమే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పష్టంచేశారు. ‘భవనాల్ని, భూముల్ని తాకట్టుపెట్టడానికా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది? ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు మీరే తలుపులు తెరిచారు. పోస్కో ప్రతినిధులను కొరియా నుంచి పిలిచిందెవరు?’ అని ప్రశ్నించారు. సోమవారం విశాఖలో జనసేన విశాఖ గ్రామీణ కార్యకర్తలతో మాట్లాడారు. తమ బడులను మూయొద్దంటూ విశాఖలో ఓ ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కి పోరాటం చేస్తుంటే పోలీసులు వారినీ ఇబ్బంది పెట్టారన్నారు. ‘నవరత్నాల ఉంగరాలను వంద మందిలో 25 మందికిస్తే.. మిగిలిన 75 మంది చూస్తూ కూర్చుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా జరగాలి. సంక్షేమమే చేస్తాం.. అభివృద్ధిని పక్కన పెట్టేస్తామంటే అది సుపరిపాలన అవదు’ అని పవన్ గుర్తుచేశారు.
ఎవరూ భయపడొద్దు
జనసేన శ్రేణుల దృష్టి మరల్చేందుకు, వారిని రెచ్చగొట్టేందుకే వైకాపా నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. మీరు మాత్రం గీత దాటవద్దని, సహనం కోల్పోవద్దని శ్రేణులకు పవన్ హితవు పలికారు. ‘మనం ఏ సమస్యపై మాట్లాడుతున్నామో వారు కూడా అదే సమస్యపై మాట్లాడేలా చేయాలి. ఎవరూ భయపడవద్దు’ అని వివరించారు. వైకాపాకు 22 మంది ఎంపీలుంటే ప్రజలకు రఘురామకృష్ణరాజు మాత్రమే గుర్తున్నారని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతే పనిచేసేవారితో ఉత్తరాంధ్రలో కమిటీలను ఏర్పాటు చేస్తామని పవన్‌కల్యాణ్ వెల్లడించారు.
పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్ల అప్పు తప్ప ఏమీ మిగల్లేదన్నారు. అనంతరం పిల్లా శ్రీను అనే క్రియాశీల కార్యకర్త సతీమణి సూర్యకుమారికి రూ.5 లక్షల చెక్కును, ప్రమాదాల్లో గాయపడిన ఇద్దరికి మెడిక్లెయిమ్ చెక్కులను ఇచ్చారు. కార్యక్రమంలో పీఏసీ సభ్యుడు అర్హంఖాన్, కోన తాతారావు ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.