PAWAN SPEECH AT REPUBLIC DAY CELEBRATIONS: ప్రజాస్వామ్యం అంటే ప్రజల సొంతమని.. వైఎస్సార్‌సీపీనో.. సజ్జల సొంతమో కాదని గుర్తుంచుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. జెండా ఆవిష్కరణ అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
నా లాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరు:ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పవన్ నిప్పులు చెరిగారు. రిపబ్లిక్ డే రోజున చెప్తున్నా.. ఏపీకి చెందిన నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని మండిపడ్డారు. 'విసిగిపోయాం.. మీ బతుకులకేం తెలుసు? కానిస్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ చదివారా? అవినీతిలో మునిగిపోయిన పబ్లిక్ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా? మేం చూస్తూ కూర్చొంటామా'? అని నిలదీశారు.
సన్నాసులతో విసిగిపోయాం: 'మేం దేశ భక్తులం.. ఆంధ్రప్రదేశ్‌ను ఇంకోసారి విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. తమాషాలుగా ఉందా? సన్నాసులతో విసిగిపోయాం. ఎంతమంది సీఎంలు రాయలసీమ నుంచి వచ్చారు? ఆ ప్రాంతానికేం చేశారు? అక్కడ నుంచి వలసలు ఎందుకు ఆపలేకపోయారు' అని తీవ్రంగా మండిపడ్డారు.
"వేర్పాటువాద ధోరణితో ఎవరైనా మాట్లాడితే నాలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరు. విసిగిపోయాం.. మీ బతుకులకేం తెలుసు? కానిస్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ చదివారా? అవినీతిలో మునిగిపోయిన మీరు.. పబ్లిక్ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా? మేం చూస్తూ కూర్చొంటామా? మేం దేశ భక్తులం.. ఆంధ్రప్రదేశ్‌ను ఇంకోసారి విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. తమాషాలుగా ఉందా? సన్నాసులతో విసిగిపోయాం"-పవన్, జనసేన అధినేత
మీ స్వార్థం కోసం స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దు:ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలా? వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కోసం తెలంగాణలోని జగిత్యాలకు చెందిన సాయిరెడ్డి చనిపోయారని.. గుంటూరులో హబీబుల్లా మస్తాన్ మరణించారు. ఆ సంగతి మీకు తెలుసా? అని నిలదీశారు. మీ స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దని.. రాష్ట్రాన్ని, ప్రజల్ని విడగొట్టింది చాలు.. ఇక ఆపేయండి అని పవన్ వ్యాఖ్యానించారు.
బాధ్యతగా మెలగకపోతే మెడలు వంచుతాం:వైఎస్సార్‌సీపీ నేతలు బాధ్యతగా మెలగాలని.. లేకుంటే మెడలు వంచుతామని పవన్ హెచ్చరించారు. వైసీపీలా కులాల మధ్య తగవులు పెట్టేందుకు రాలేదని స్పష్టం చేశారు. కులాలపై ప్రేమ ఉన్నంతవరకు, ఆధిపత్య ధోరణి ఉన్నంత వరకు రాష్ట్రంలో అభివృద్ధి జరగదని వ్యాఖ్యానించారు. రాజకీయ స్థిరత్వం ఉంటేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని.. కొందరు వైసీపీ నేతలు వేర్పాటువాద ధోరణితో ఉన్నారని విమర్శించారు.