ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వీకర్స్ కాలనీకి చెందిన లోకేష్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, సీఐ ఆకుల రఘు వేధింపులే ఇందుకు కారణమని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఏపీ నిట్లో పొరుగు సేవల ఉద్యోగిగా పనిచేస్తున్న లోకేశ్... జనసేన కార్యకలాపాల్లోనూ పాల్గొంటుండేవాడు. స్థానికంగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా విషయమై ప్రశ్నించడంతో... ఉద్యోగం తీయించేస్తామని ఎమ్మెల్యే, సీఐ బెదిరించారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. అలాగే కాళ్లు పట్టుకుంటే వదిలేస్తామని అన్నారని... ఇదంతా తట్టుకోలేక చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. అనంతరం బుధవారం రాత్రి పట్టణ పోలీసు స్టేషన్ ఆవరణలో లోకేష్ పురుగుల మందుతాగాడు. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
అప్పట్నుంచే వేధింపులు:లోకేశ్
ఈ నెల 18న ప్రభుత్వ పాఠశాల వైపు వస్తున్న ఇసుక లారీని ఆపి... ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునే ప్రయత్నం చేశాను. అప్పటినుంచి పోలీసు వేధింపులు మొదలయ్యాయి. చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్న తనను... మానసికంగా వేధించారు. -సెల్ఫీ వీడియోలో లోకేశ్