TSPSC Chairman Janardhan Reddy Resigned :టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి, తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు సమాచారమిచ్చారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆయన రాజీనామాను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని రాజ్ భవన్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. సోమవారం రోజున టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని ప్రకటనలో పేర్కొంది. మరోవైపు కమిషన్ సభ్యులు కూడా రాజీనామా చేయనున్నట్టు సమాచారం.
2021 మేలో జనార్దన్ రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వం హయాంలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. వరుస పేపర్‌లీకేజీల నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయి రాజీనామా చేశారు.
గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1, అసిస్టెంట్ ఇంజినీర్, ఏఈఈ ప్రశ్నపత్రాలు లీకవటం కలకలం సృష్టించింది. టీఎస్పీఎస్సీలో పనిచేసే ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి పలు ప్రశ్నపత్రాలు తస్కరించి, బయటి వ్యక్తులకు విక్రయించినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమినరీ, ఏఈఈ, డీఏవో పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షల తేదీలను మార్చింది.
గత సర్కార్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన వంద మందికి పైగా నిందితులను అరెస్టు చేసింది. వారు ఇకపై పరీక్షలు రాయకుండా కమిషన్ డీబార్ చేసింది. అనంతరం ఓఎమ్ఆర్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. గ్రూపు సర్వీసులకు మినహా మిగతా పరీక్షలన్నింటికి సీబీఆర్టీ విధానంలో, ఎక్కువ మంది ఉంటే నార్మలైజేషన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు.
Janardhan Reddy Resigned post of TSPSC Chairman :ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలోనూ లోపాలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. లోపాలు నిజమేనని పేర్కొంటూ న్యాయస్థానం పరీక్షను రద్దుచేయడంతో కమిషన్‌పై నిరుద్యోగుల్లో ఆగ్రహం పెల్లుబికింది. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశంలో ఛైర్మన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ(TSPSC) బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు, నిరుద్యోగులు డిమాండ్ చేశారు.