కరోనా వల్ల గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పురోగమనంలో పెట్టడానికి ప్రధాని మోదీ.. 'ఆత్మ నిర్భర్ భారత్' పేరుతో 20లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జన్ సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అమాయకులు ప్రాణాలు కొల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్లు లేని దుస్థితి నెలకొందని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి మాయమయ్యారని మండిపడ్డారు.
'ఆ డబ్బుతో కరోనా ఆసుపత్రి నిర్మించొచ్చు' - జన్‌సంవాద్ సభ తాజా వార్తలు
భాజపా రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్ సంవాద్ సభకు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు హాజరయ్యారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాంచందర్ రావు, డీకే అరుణ పాల్గొన్నారు.
కరోనా నుంచి దేశాన్ని ఆదుకోవడానికి ప్రధాని 20 లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటిస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రివి ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప చేసిందేమీ లేదన్నారు. పాలమూరులో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మొదలు పెట్టలేదని.. పాతవి పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, ప్రాజెక్టులు ఏమయ్యాయని ప్రశ్నించారు. కరోనా నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సచివాలయం కూల్చివేస్తున్నారని ఆరోపించారు. సచివాలయం కూల్చేసే నిధులతో కరోనా ఆసుపత్రి కట్టొచ్చన్నారు సంజయ్.
ఇవీ చూడండి:వాస్తు పేరుతో ప్రజాధనం వృథా : రేవంత్‌రెడ్డి