Jal Shakti Ministry Review: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల అప్పగింత, నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎలా ఉందని కేంద్ర జల్‌శక్తిశాఖ ఆరా తీసింది. శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ గురువారం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ) ఛైర్మన్లతో ఆన్‌లైన్ వేదికగా సమీక్ష నిర్వహించారు. కేఆర్‌ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్, కార్యదర్శి బీపీ పాండే, జీఆర్‌ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, కార్యదర్శి రాయ్‌పురే హైదరాబాద్‌లోని బోర్డుల ప్రధాన కార్యాలయాల నుంచి ఈ సమీక్షలో పాల్గొన్నారు. గతేడాది జులైలో కృష్ణా, గోదావరి నదులపైఉన్న పలు ప్రాజెక్టులను బోర్డులపరిధిలోకి చేర్చుతూ నోటిఫికేషన్ జారీ, దాని అమలు, పురోగతిపై పంకజ్‌కుమార్ వివరాలు అడిగినట్లు తెలిసింది. గెజిట్‌లో పేర్కొన్న వాటిలో కొన్నింటికి సంబంధించిన సమాచారాన్నే రెండు రాష్ట్రాలు అందజేశాయని, ప్రాజెక్టుల స్వాధీనానికి అభ్యంతరాలు లేవనెత్తుతున్న తీరు, సీడ్‌మనీపై ప్రభుత్వాల అభిప్రాయాలను బోర్డుల ఛైర్మన్లు వేర్వేరుగా వివరించినట్లు తెలిసింది.
శ్రీశైలం.. సాగర్‌లను బోర్డులకు అప్పగించండి
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలని, దీనికి సంబంధించిన చర్చలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ రెండు రాష్ట్రాలకు సూచించారు. మూడో అపెక్స్ కౌన్సిల్‌కు సంబంధించి ఎజెండా రూపకల్పన సమావేశంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో గత నెల 28న ఈ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అయితే సమావేశపు మినిట్స్‌ను గురువారం కేంద్రం విడుదల చేసింది. గెజిట్ నోటిఫికేషన్ అమలుకు సంబంధించి రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాంతాన్ని బోర్డులకు అప్పగించాలని, నిర్వహణకు సీడ్ మనీ, వనరులను కేటాయించాలని కూడా ఆయన రాష్ట్రాలకు సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.