తెలంగాణ

telangana

ETV Bharat / state

నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లతో కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష - grmb

JALSHAKTI MINISTRY REVIEW ON THE PROGRESS OF KRMB GRMB NOTIFICATION
నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లతో కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష

By

Published : Jan 27, 2022, 12:02 PM IST

Updated : Jan 27, 2022, 12:18 PM IST

12:00 January 27

కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లతో వర్చువల్‌గా సమీక్ష

నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లతో కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష నిర్వహిస్తోంది. కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లతో వర్చువల్‌గా కేంద్ర జలశక్తి కార్యదర్శి పంకజ్‌ కుమార్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్, జీఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ పాల్గొన్నారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు పురోగతిపై సమావేశంలో చర్చిస్తున్నారు.

రెండు బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ గత జులై 15న జారీ చేసిన నోటిఫికేషన్ అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. నోటిఫికేషన్​లో పేర్కొన్న ప్రాజెక్టులను రెండు రాష్ట్రాలు బోర్డులకు స్వాధీనం చేయాల్సి ఉంది. ఆ దిశగా బోర్డుల సమావేశం, ఉపసంఘం భేటీలు జరిగినప్పటికీ ఇరు రాష్ట్రాలు ఒక్క ప్రాజెక్టును కూడా స్వాధీనం చేయలేదు.

రెండు బోర్డులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సీడ్ మనీ కింద 200 కోట్ల రూపాయల చొప్పున జమ చేయాల్సి ఉంది. అది కూడా జరగలేదు. గెజిట్ ప్రకారం అనుమతులు లేని ప్రాజెక్టులకు ఈ నెల 15వ తేదీ లోపు అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఆ ప్రక్రియ కూడా పూర్తి కావాల్సి ఉంది. గెజిట్ అమలుపై ఇటీవలే రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో చర్చించిన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్... నేడు బోర్డు ఛైర్మన్లతో సమీక్ష నిర్వహిస్తోంది. అమలు పురోగతి, రాష్ట్రాల నుంచి అందిన వివరాలు, సమాచారం, సహకారం తదితరాలను తెలుసుకోనున్నారు.

సమస్యల పరిష్కారం కోసం..

ప్రాజెక్టుల నిర్వహణ, అనుమతుల్లేని ప్రాజెక్టుల అంశానికి సంబంధించి బోర్డు ఛైర్మన్లకు దిశానిర్దేశం చేయనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే అత్యున్నత మండలి సమావేశం నిర్వహిస్తామని సీఎస్​లతో భేటీ సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి చెప్పారు. అందుకు సంబంధించిన అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ దిశగా కూడా బోర్డు ఛైర్మన్లతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి చర్చించే అవకాశం ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 27, 2022, 12:18 PM IST

ABOUT THE AUTHOR

...view details