తెలంగాణ

telangana

By

Published : Jul 16, 2021, 10:47 AM IST

ETV Bharat / state

Manhole: నిధులు మింగుడు.. మురుగు పొంగుడు

జలమండలి ప్రకటనలకు క్షేత్రస్థాయిలో తీరుకు పొంతన ఉండటం లేదు. మ్యాన్‌హోళ్ల నిర్వహణ, మరమ్మతుల పేరుతో రూ.కోట్లు వెచ్చిస్తున్నా... సమస్య తీరడంలేదు. ఆస్థాన గుత్తేదారులకు నిధుల పంట పండించడం తప్పా.. క్షేత్రస్థాయిలో ఒరిగిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

mahole problems
మ్యాన్‌హోళ్ల నిర్వహణ

మ్యాన్​హోళ్ల నిర్వహణ, మరమ్మతులకు కోట్లు వెచ్చిస్తున్నా... అవి దారి మళ్లడం తప్పా... సమస్య తీరడం లేదు. ఉన్నతాధికారులు ఎన్నిసార్లు సమీక్ష సమావేశాలు పెట్టి హెచ్చరించినా... డివిజన్‌ స్థాయి అధికారులకు చీమ కుట్టినట్లైనా ఉండటం లేదు. అత్యవసర పనుల కింద మ్యాన్‌హోళ్ల మరమ్మతులు, మురుగు తొలగింపునకు సంబంధించి ప్రతి నెలా డివిజన్‌కు రూ.10 లక్షల చొప్పున ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొత్త మ్యాన్‌హోళ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు. ఇటీవల రోడ్డుకు సమాంతరంగా మ్యాన్‌హోళ్లను తీర్చిదిద్దేందుకు రూ.8 కోట్లు వెచ్చించారు. ఇప్పటికే చాలాచోట్ల అవి మళ్లీ మరమ్మతులకు గురయ్యాయి. గ్రేటర్‌వ్యాప్తంగా మురుగు గొట్టాలపై 2.6 లక్షల మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. పర్యవేక్షణ, నిర్వహణ జలమండలి చూస్తుంది. వరద కాల్వలపై మరో లక్ష ఉన్నాయి. వీటిని జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తోంది. నిధులు ఖర్చవుతున్నా, తరచూ ఇవి మరమ్మతులకు గురవుతున్నాయి. సాధారణ మ్యాన్‌హోళ్ల నిర్మాణానికి రూ.20 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు గుత్తేదారులు చూపించి బిల్లులు పొందుతున్నారు. క్షేత్రస్థాయిలో పనుల్లో నాణ్యతాలోపం కనిపిస్తోంది.

కానరాని ప్రత్యేక బృందాలు

‘వానాకాలానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేశాం. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. ప్రతి డివిజన్‌కు ఒక మినీ ఎయిర్‌టెక్‌ యంత్రాన్ని అందుబాటులో ఉంచాం. ఎక్కడ మ్యాన్‌హోల్‌ పొంగినా సరే...దానితో బృందాలు అక్కడకు చేరి వెంటనే శుభ్రం చేస్తాయి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం’. - ఇటీవల జలమండలి ప్రకటన ఇది

ఎయిర్‌టెక్‌ యంత్రాలు ఎక్కడ?

జలమండలిలో 15 వరకు పెద్ద ఎయిర్‌టెక్‌ యంత్రాలతో పాటు 40 వరకు చిన్న యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో దందా కొనసాగుతోంది. ఎక్కడ మురుగు పొంగినా సరే... వీటి ద్వారా శుభ్రం చేయాలి. నిత్యం కనీసం 500 మీటర్ల వరకు మ్యాన్‌హోళ్లను శుభ్రం చేయాలి. కొన్ని యంత్రాలు తూతూ మంత్రంగా పనులు చేస్తున్నాయి. అసలు చేయకుండానే చేస్తున్నట్లు రాసేసి కొందరు చేతి వాటం చూపుతున్నారు. ఏటా ఎయిర్‌టెక్‌ యంత్రాల పేరుతో రూ.కోట్లలోనే బిల్లులు చెల్లిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన మార్గాల్లో తప్పా... గల్లీలు, కాలనీల్లోని మ్యాన్‌హోళ్లు పొంగితే పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

Hyd Rains : ఒక్క వానకే చిత్తడయిన భాగ్యనగరం

సిల్టు ఛాంబర్లు లేకపోవడంతో...

అనేక ప్రాంతాల్లో హోటళ్లు ఇతర వ్యాపార యూనిట్లు నడుస్తున్నాయి. అక్రమంగా మురుగును జలమండలి పైపులకు కలుపుతున్నారు. వాటిపై భారం పడుతోంది. సామర్థ్యానికి మించి మురుగు వస్తుండటంతో బయటకు పొంగుతోంది. చాలా హోటళ్లలో సిల్టు ఛాంబర్లు లేవు. ఘన ప్లాస్టిక్‌ వ్యర్థాలు పైపుల్లోకి చేరి అడ్డం పడటంతో మురుగు ముందుకు కదలడం లేదు. జనావాసాల్లో రోజుల తరబడి పేరుకుపోతోంది. దోమలకు కేంద్రాలుగా మారుతున్నాయి.

కవాడిగూడ నుంచి ముషీరాబాద్‌ వెళ్లే ప్రధాన రహదారి ఇది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇక్కడ మ్యాన్‌హోల్‌ పొంగిపొర్లుతోంది. జలమండలి సిబ్బంది అటువైపే చూడటం లేదు. ఫిర్యాదు చేసినా దిక్కు లేదని స్థానికులు వాపోతున్నారు. ఇక్కడే కాదు సికింద్రాబాద్‌ మహ్మద్‌గూడ ప్రధాన రహదారి... ఒలిఫెంటా వంతెన వద్ద సైతం కొన్నిరోజులుగా మురుగు పొంగుతోంది.

ఇదీ చూడండి:బాలుడిని రక్షించేందుకు వెళ్లి బావిలో పడ్డ 40 మంది- నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details