ఏడాది కాలం, ఆపై నుంచి నల్లా బిల్లు చెల్లించని నాన్ డొమెస్టిక్.. నాన్ ఫ్రీ వాటర్ కనెక్షన్ల బకాయిలను వసూలు చేయాలని అధికారులను జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్లు తొలగించాలని తెలిపారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి ఓ అండ్ ఎం, రెవెన్యూ, ఎంసీసీ.. సింగిల్ విండో తదితర అంశాలపైన అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఎంసీసీకి వచ్చే ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎండీ దానకిశోర్ అధికారుతో పేర్కొన్నారు. కలుషిత నీరు,మురుగు నీరు పొంగిపొర్లడం, మూతలు లేని మ్యాన్ హోల్స్‌పై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. దీర్ఘ కాలికంగా బకాయిలు చెల్లించడంలో మొండికేస్తున్న వారికి నోటీసులు జారీ చేయాలని అన్నారు. స్పందించని పక్షంలో వారి కనెక్షన్ తొలగించాలని స్పష్టం చేశారు.