Monsson Teams in Hyderabad : హైదరాబాద్‌లో నిరంతరం అందుబాటులో ఉండేలా 16మాన్సూన్ బృందాల ఏర్పాటు చేసినట్టు జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులు ఉంటారని.. ఈ బృందాలకు ప్రత్యేక వాహనాలు ఉంటాయని చెప్పారు. ఈమేరకు మాన్సూన్ బృందాల ప్రత్యేక వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఎక్కడైనా నీరు నిలిస్తే.. నీటిని తొలగించేందుకు ఈ వాహనంలో జనరేటర్‌తో కూడిన డివాటర్ మోటర్ ఉంటుందని వివరించారు.
పార, గడ్డపార, రక్షణ తాళ్లు వంటి పరికరాలు వాహనాల్లో అందుబాటులో ఉంచామన్నారు. జీహెచ్ఎంసీ గుర్తించిన మొత్తం 211 నీరు నిలిచే ప్రాంతాలపై ఈ బృందాలు ప్రత్యేకంగా దృష్టి పెడతాయని దానకిశోర్ వివరించారు . వీటితోపాటు మరో 16 ఎయిర్‌టెక్ వాహనాలు అందుబాటులో ఉండేలా చూస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో ఎక్కడైనా నీరు నిలిస్తే జలమండలి కస్టమర్ కేర్ నెంబర్ 15531కు ఫోన్ చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు.