Jai Mahabharat Party Women MLA Tickets Telangana 2023 :తెలంగాణలో ఎన్నికలవేడి రాజుకుంది. ఇప్పటికే పార్టీలు కదనరంగంలోకి దూకాయి. అధికార బీఆర్ఎస్ మొదటగా తన అభ్యర్థులను ప్రకటించి.. ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరింది. కాంగ్రెస్ కూడా 100 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ఇప్పటి వరకూ 53 మందిని ప్రకటించగా.. మిగతా అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది.
Telangana Assembly Polls 2023 :ఓవైపు టికెట్ దక్కించుకున్న నేతలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తూ.. గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలతో.. ప్రధాన పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. కార్యకర్తల నుంచి పార్టీ అధినేతల వరకు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇలా ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారంలో దూసుకెళ్తుండగా వైఎస్సార్టీపి.. జనసేన వంటి పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మరో పార్టీ 119 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటిస్తామంటూ ఓ వినూత్న ప్రకటన చేసి అందర్నీ ఆకట్టుకుంది.
Jai Mahabharat Party MLA Candidates List Telangana 2023 : : తెలంగాణల అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలను మహిళలకే కేటాయిస్తున్నట్లు జై మహా భారత్ పార్టీ (Jai Maha Bharat Party) ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ సైఫాబాద్‌లోని కార్యాలయంలో .. పార్టీ జాతీయ అధ్యక్షుడు భగవాన్ అనంతవిష్ణు ప్రభు (Bhagwan Anantavishnu Prabhu) ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా 11 స్థానాలకు అభ్యర్థులను ఆయన ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), మంత్రులపై బలమైన మహిళా అభ్యర్థులను నిలబెట్టి వారిని ఓడిస్తామని అనంతవిష్ణు ప్రభు చెప్పారు.
తమ పార్టీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని భగవాన్ అనంతవిష్ణు ప్రభు హామీ ఇచ్చారు. 119 స్థానాల్లో మహిళా అభ్యర్థులను బరిలోకి దించనునట్లు పేర్కొన్నారు. నవంబర్ 1న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 50,000 మందితో మహిళా గర్జన నిర్వహిచనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం అందిస్తామని.. భూలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు 200 గజాల స్థలాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని అనంతవిష్ణు ప్రభు వెల్లడించారు.