Jaggareddy: కాంగ్రెస్‌కు రాజీనామాను వాయిదా వేసుకుంటున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. 15 రోజులు వేచి చూసి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు సమస్య మూలాలను తెలుసుకోవట్లేదని మండిపడ్డారు. టీ కప్పులో తుపాను అంటూ తేలిగ్గా కొట్టి పారేస్తున్నారన్నారు. అసలు సమస్య ఎందుకు వచ్చిందో ఆలోచించట్లేదని ధ్వజమెత్తారు. పార్టీలోని కొందరు నేతలు తనకు సర్దిచెప్తున్నారన్నారు. సోనియా, రాహుల్‌ను కలిస్తే సమస్య పరిష్కారం అవుతుందేమోనని అన్నారు. పార్టీలో సమస్యల గురించి 15 రోజులు మాట్లాడనన్నారు. పులి లాంటి నేను ఎలుకలతో పోట్లాడనని వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడు వచ్చి కలిసినా పార్టీలో ఉండే పరిస్థితి లేదన్నారు. తనసమస్య మాణిక్యం ఠాగూర్, రేవంత్‌తో పరిష్కారం అవుతుందన్నారు.
కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెరాస-భాజపాల మధ్య చీకటి ఒప్పందం ఉందనే ఆరోపణల నుంచి బయటపడేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని ఆయన అన్నారు. అందుకోసమే మహారాష్ట్ర సీఎం, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లను కలిసేందుకు వెళ్లారన్నారు.