Central Government Water Awards To Telangana : కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రవిజయ పరంపర కొనసాగుతూనే ఉంది. ఉత్తమ నీటి విధానాలను అవలంభించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. ఈ నాలుగో జాతీయ నీటి అవార్డులను కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించింది. అలాగే ఉత్తమ జిల్లాల కేటగిరీలో ఆదిలాబాద్ జిల్లాకు మూడో స్థానం దక్కింది. ఉత్తమ సంస్థల విభాగంలో హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వ విద్యాలయానికి రెండో స్థానం లభించింది. ఈ నెల 17న దిల్లీ విజ్ఞాన్ భవన్లో జరగనున్న కార్యక్రమంలో.. ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందించనున్నారు.
మొత్తం 11 విభాగాల్లో 41 అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ రాష్ట్రంగా మధ్యప్రదేశ్, ఉత్తమ జిల్లాగా ఒడిశాలోని గంజాం జిల్లా ఎంపికైంది. ఉత్తమ రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్.. బిహార్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది. నంద్యాల జిల్లా చాగలమర్రి కేజీబీవీ పాఠశాల ఉత్తమ పాఠశాలలుగా రెండో స్థానం సంపాదించింది. ఉత్తమ పరిశ్రమల విభాగంలో తిరుపతికి చెందిన సీసీఎల్ ప్రొడక్ట్స్ మూడో స్థానంలో నిలవగా.. ఉత్తమ ఎన్జీవోగా అనంతపూర్‌కు చెందిన అక్కియాన్ ఫ్రాటెర్నా ప్రోత్సాహక బహుమతి దక్కించుకుంది.