ISKCON temple: సంక్రాంతి పండుగ సందర్భంగా ఇస్కాన్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో జగన్నాథ రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. రథోత్సవంలో రథాన్ని లాగే అవకాశాన్ని నిర్వాహకులు చిన్నారులకు కల్పించారు. నేడు భోగి పర్వాదినాన్ని పురస్కరించుకుని ఇస్కాన్ మందిరంలో భోగి మంటలు వేశారు. అనంతరం దేవేరులకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. చిన్నారులు స్వామివారి రథోత్సవం సందర్భంగా ఆలపించిన గీతాలు, చేసిన నృత్యాలు భక్తులను ఎంతగానో అకట్టుకున్నాయి.
జగన్నాథుడిని కీర్తిస్తూ చిన్నారులు రథాన్ని ముందుకు లాగారు. ఇస్కాన్ దేవాలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర రామలింగేశ్వర నగర్లోని ప్రధాన వీధుల్లో కొనసాగింది. చిన్నారులు రథాన్ని లాగుతుండగా స్థానికులు, భక్తులు వారి వెంటనడిచారు. నాలుగు సంవత్సరాల నుంచి విజయవాడ నగరంలో రథోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఈసారి పిల్లలకు అవకాశం ఇవ్వాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామని ఇస్కాన్ విజయవాడ శాఖ మేనేజర్ వేణుధారి కృష్ణదాస్ తెలిపారు.