ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కేసులకంటే ఈడీ కేసులపై విచారణ చేపట్టవచ్చంటూ ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించామని జగతి పబ్లికేషన్స్ తరపు న్యాయవాది ఎన్.నవీన్ కుమార్ మెమో దాఖలు చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ముందుకు విచారణకు రావాల్సి ఉన్నా రాకపోవడం వల్ల న్యాయమూర్తి సూచనల మేరకు రిజిస్ట్రార్ జనరల్‌కు పిటిషన్లపై అత్యవసర విచారణకు కారణాలను వివరిస్తూ లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఈ మెమోను పరిశీలించిన సీబీఐ కోర్టు న్యాయమూర్తి బీ.ఆర్.మధుసూధన్ రావు హైకోర్టు ఉత్తర్వులు సమర్పించడానికి చివరగా మరో అవకాశం ఇస్తూ విచారణను 9వ తేదీకి వాయిదా వేశారు.
జగన్ అక్రమాస్తుల కేసు.. తదుపరి విచారణ 9కి వాయిదా
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన ఆరు కేసుల్లో అయిదింటిపై ఈడీ ప్రత్యేక హోదా ఉన్న సీబీఐ ప్రధాన కోర్టు.. విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. భారతి సిమెంట్స్, పెన్నా, జగతి పబ్లికేషన్స్, రాంకీ, ఇండియా సిమెంట్స్ కేసుల విచారణ 9కి వాయిదా పడింది.
హెటిరో, అరబిందో వ్యవహారంపై ఈడీ కేసులో తన తరఫు సహ నిందితుడు హాజరుకావడానికి అనుమతించాలంటూ ప్రధాన నిందితుడైన వైఎస్.జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను 16వ తేదీకి వాయిదా వేశారు. రాంకీ కేసులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్ పై సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ... జగన్ కంపెనీల్లోకి రాంకీ పెట్టుబడులు క్విడ్ ప్రోకో కింద వచ్చాయని చెప్పడం సరికాదన్నారు. రాంకీ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికి ముందే ప్రాజెక్టును పొందిందని కేవలం బఫర్ జోన్ సంబంధించి మాత్రమే వైఎస్.హయాంలో జరిగిందన్నారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ కిలోమీటరు బఫర్ జోన్ ఉండాలని సిఫారసు చేసిందని అనంతరం 500 మీటర్లకు తగ్గించిందని.. దీన్ని వైఎస్.ప్రభుత్వం అమలు చేసిందన్నారు. దీంతోపాటు వాన్ పిక్, జగతి పెట్టుబడుల కేసుల విచారణ 7వ తేదీకి, పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్ రెడ్డి డిశ్చార్జీ పిటీషన్ పై విచారణ 8వ తేదీకి వాయిదా పడింది.
ఇదీ చదవండి:'యూడీఎస్ భూములు తక్కువ ధరకు అమ్మితే పెనాల్టీ తప్పదు'