ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ వినతి పత్రం అందజేశాయి. బదిలీలు, పదోన్నతులు పాత జిల్లాల ప్రాతిపదికన, యాజమాన్యం వారీగా నిర్వహిస్తామని మార్చి 22న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన అమలు చేయాలని కోరింది. బషీర్బాగ్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జాక్టో, యుఎస్పీసీ స్టీరింగ్ కమిటీ నాయకులు మంత్రిని కలిశారు. వేసవి సెలవులు పూర్తి కావొస్తున్నా షెడ్యూల్ విడుదల చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పలువురు అధికారులు కొవిడ్ బారిన పడడం వల్ల షెడ్యూల్ విడుదలలో జాప్యం జరిగిందని మంత్రి అన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టుల మంజూరు కోసం ఫైల్ సర్క్యులేషన్లో ఉందని... ఆమోదం రాగానే షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. పాత జిల్లాలు, యాజమాన్యాల వారీగానే నిర్వహించనున్నామని స్పష్టం చేశారు. ఆదర్శ పాఠశాలల్లోనూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహిస్తామన్నారు. అంతర్ జిల్లా బదిలీల ఫైల్ సాధారణ పరిపాలనా శాఖ పరిశీలనకు పంపామని... రాగానే ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపి ఆమోదించిన తర్వాత షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు.